రఫేల్‌ ఒప్పందంపై రాహుల్ చెప్పిన 10 అబద్దాలు

రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ ఒప్పందంపై ‘ద హిందూ’ పత్రిక ప్రచురించిన కథనంతో మరోసారి రఫేల్ వేడి రాజుకుంది. రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర బేరసారాలు జరపడాన్ని రక్షణశాఖ కార్యదర్శి తప్పుబట్టారంటూ ఆ పత్రిక కథనం పేర్కొంది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మరో ఆయుధం లభించినట్లయింది. ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే రాహుల్‌ ఆరోపణలను బీజేపీ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది. రాహుల్‌ అబద్ధాల కోరు అని దుయ్యబట్టింది.

‘మీరంతా కొత్త రోజును నిజాయతీగా ప్రారంభిస్తుంటే రాహుల్‌గాంధీ మాత్రం మరిన్ని అబద్ధాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన చెప్పిన అబద్ధాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం చాలా కష్టం. కానీ రఫేల్‌పై ఆయన మాట్లాడిన అసత్యాలను కొన్ని మేం తీసుకొచ్చాం’ అని భాజపా తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. రాహుల్‌ 10 అబద్ధాలు ఇవేనంటూ వరుస ట్వీట్లలో తెలిపింది. అవేంటంటే..

1వ అబద్ధం: ఫ్రెంచ్‌ మీడియా కథనాలను మార్చి భారత ప్రభుత్వం బలవంతంతోనే డసో ఏవియేషన్‌ తన విదేశీ భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంచుకుంది అని రాహుల్‌ చెప్పారు

నిజమేంటంటే.. రిలయన్స్‌ ఎంపికలో భారత ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అటు డసో సీఈవో, ఇటు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

2వ అబద్ధం: రఫేల్‌ ఒప్పందంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్లు సుప్రీంకోర్టు గుర్తించిందని తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు.

నిజమేంటంటే.. ఈ ఒప్పందంపై కాంగ్రెస్‌ ప్రతినిధులు వేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయలేదని స్పష్టం చేసింది.

3వ అబద్ధం: రఫేల్‌ ఒప్పందం విషయంలో పీఎంవో కార్యాలయంపై ఫిర్యాదు చేస్తూ రక్షణమంత్రికి నివేదిక పంపినందుకుగానూ రక్షణశాఖలోని ఓ సీనియర్‌ అధికారిపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని రాహుల్‌ చెప్పారు.

నిజమేంటంటే.. సదరు సీనియర్‌ అధికారే మీడియా ముందుకొచ్చి అదంతా అబద్ధమని వెల్లడించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

4వ అబద్ధం: ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ భారత ప్రధాని మోదీని దొంగ అన్నారని రాహుల్‌ చెప్పారు. రిలయన్స్‌ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని, తమకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో రిలయన్స్‌ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని హోలన్‌ చెప్పారని రాహుల్‌ ఆరోపించారు.

నిజమేంటంటే.. ఈ ఆరోపణలను హోలన్‌ తోసిపుచ్చారు. దీనిపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

5వ అబద్ధం: పార్లమెంట్‌ ముందు కూడా రాహుల్ అసత్యాలు చెప్పారు. రఫేల్‌ యుద్ధ విమానాల ధరను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ నుంచి వ్యక్తిగతంగా తాను తెలుసుకున్నానని రాహుల్‌ అన్నారు.

నిజమేంటంటే.. రాహుల్‌ ఆరోపణలను ఖండిస్తూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కీలక సమాచారాన్ని బహిర్గతం చేయకుండా రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

6వ అబద్ధం: యూపీఏ హయాం నాటి ఒప్పందం ప్రకారం రఫేల్‌ యుద్ధ విమానాల ధరను రాహుల్‌ ఒక్కో సభలో ఒక్కో విధంగా చెప్పారు.

పార్లమెంట్‌లో రూ. 520 కోట్లు అన్నారు. కర్ణాటక సభలో రూ. 526 కోట్లు.. రాజస్థాన్‌లో రూ. 540కోట్లు, దిల్లీలో రూ. 700కోట్లు అని చెప్పుకొచ్చారు. ఆయన అబద్ధాలకు నోబెల్‌ ఇవ్వాల్సిందే.

7వ అబద్ధం: సైనిక సంపత్తి కోసం చేపట్టే విధివిధానాలు, ప్రక్రియలను మోదీ ప్రభుత్వం తిరస్కరించిందని రాహుల్‌ చెప్పారు.

నిజమేంటంటే.. రఫేల్‌ ఒప్పంద ప్రక్రియలో అనుమానించదగ్గ విషయాలేవీ లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

8వ అబద్ధం: యూపీఏ హయాంలో రఫేల్‌ యుద్ధ విమానాల ధర రూ. 526/520/540(ఒక్కో చోట ఒక్కో రకంగా చెప్పారు) కోట్లకు ఒప్పందం చేసుకోగా.. ఎన్డీయే మాత్రం రూ. 1,600కోట్లకు కొనుగోలు చేసిందని రాహుల్‌ ఆరోపించారు.

నిజమేంటంటే.. ఎన్డీయే ప్రభుత్వం పూర్తి ప్యాకేజీ కింద రఫేల్‌ ఒప్పందం చేసుకుంది. ఇందులోనే యుద్ధ విమానాలకు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ధర ఇంతంటూ ఒప్పందం చేసుకోలేదు.

9వ అబద్ధం: పెట్టుబడిదారులకు ప్రయోజనం కల్పించేందుకే ఈ ఒప్పందం చేసుకున్నారని రాహుల్‌ అన్నారు.

నిజమేంటంటే.. రక్షణశాఖ అవసరాల మేరకే ఈ ఒప్పందం జరిగిందని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఈ యుద్ధవిమానాలతో వైమానిక శాఖ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.

10వ అబద్ధం:  రాహుల్‌ ఆరోపణలకు ద హిందూ రూపంలో మరో భాగస్వామి లభించింది. క్రాప్‌ చేసిన ఫొటోతో మరో అసత్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు.నిజమేంటంటే.. కాంగ్రెస్‌ వాళ్లు ఫొటోషాపర్స్‌ అని మాకు తెలుసు. కానీ సత్యమే గెలుస్తుందని నిన్న వారికి గట్టిగానే అర్థమైనట్లుంది.