ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు పర్యటన రేపే !

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం గుంటూరు పర్యటనకు రానున్నారు. ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చాక ప్రధాని మోడీ తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11:15కు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో 2019 ఎన్నికల బిజెపి ప్రచారానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభలో గత నాలుగున్నరేళ్లలో ఎపికి ఏ మేరకు కేంద్రం నిధులు మంజూరు చేసిందనే విషయాలను ప్రధాని వివరిస్తారని రాష్ట్ర బిజెపి నేతలు చెబుతున్నారు.ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించడంతో పాటు, రాష్ట్ర ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రధాని భరోసా ఇవ్వగలరని భావిస్తున్నారు.

తీర ప్రాంతాల్లో మూడుచోట్ల ముడిచమురు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్‌పీఆర్‌ఎల్‌, ఓఐడీబీ, కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్‌ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఈ చమురు నిల్వ కేంద్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిఫైనరీలకు పైపులైన్లు, నౌకల్లో సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

మోదీ గుంటూరు పర్యటనలో భాగంగా రెండు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. మరో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తారు. భారత వ్యూహాత్మక చమురు నిల్వల సంస్థ (ఐఎస్‌పీఆర్‌ఎల్‌), ఆయిల్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఓఐడీబీ), కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్‌ మంత్రిత్వశాఖ సంయుక్తంగా విశాఖలో ఏర్పాటుచేసిన చమురు నిల్వ కేంద్రాన్ని, ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుని ప్రధాని జాతికి అంకితమిస్తారు.

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ (బీపీసీఎల్‌) కృష్ణపట్నంలో ఏర్పాటు చేసే చమురు సమీకరణ, నిల్వ, పంపిణీ టెర్మినల్‌కు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.15 గంటల నుంచి 11.20 మధ్య ఐదు నిమిషాలపాటు ఈ ప్రాజెక్టుల ప్రత్యేకతలను అధికారులు ప్రధానికి వివరిస్తారు. వేర్వేరు చోట్ల ఉన్న ఈ ప్రాజెక్టులకు 11.20 నుంచి 11.25 గంటల మధ్య ఆయన మీట నొక్కి ప్రారంభ, శంకుస్థాపనలు చేస్తారు. గుంటూరు పర్యటనలో తొలి పదినిముషాల పాటు అధికార కార్యక్రమమాలలో పాల్గొననున్నారు.

బహిరంగసభలో ప్రసంగించటానికి ముందుగా సభా ప్రాంగణంలోనే ప్రత్యేక వేదికపై ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా యంత్రాంగానికి ఆదేశాలందాయి. మోదీ సభా ప్రాంగణానికి ఉదయం 11.10 గంటలకు చేరుకుంటారని  తెలిపాయి. ప్రధాని సభకు 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు  డీజీ రవిశంకర్‌ అయ్యర్‌ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 

విశాఖపట్నంలో జాతికి అంకితం చేయనున్న వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రంను
1.33 మిలియన్‌ మెట్రిక్‌టన్నులు నిల్వ సామర్ధ్యంతో,  రూ.1,178.35 కోట్లు వ్యయంతో చేపట్టారు. దీని ద్వారా తీర ప్రాంతాల్లో మూడుచోట్ల ముడిచమురు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్‌పీఆర్‌ఎల్‌, ఓఐడీబీ, కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్‌ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఈ చమురు నిల్వ కేంద్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిఫైనరీలకు పైపులైన్లు, నౌకల్లో సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.

ఇక, కృష్ణపట్నం వద్ద 100 ఎకరాలలో రూ 700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పెట్రో కోస్టల్‌ టెర్మినల్‌ కు శంకుస్థాపన చేస్తారు. దేశంలోని మూడో అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒకటైన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ (బీపీసీఎల్‌) కృష్ణపట్నంలో చమురు సమీకరణ, నిల్వ, పంపిణీల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకించి మోటార్‌ స్పిరిట్‌, ఇథనాల్‌, హైస్పీడ్‌ డీజిల్‌, బయో డీజిల్‌ను ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు.

కేజీ బేసిన్ లో రూ 5,300 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్యాస్‌ ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. కేజీ బేసిన్‌లోని ఓఎన్‌జీసీ నిర్వహిస్తున్న వశిష్ట ఎస్‌1 బావి నుంచి చమురుని వెలికితీసే ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు సిద్ధమైంది. అమలాపురం సమీపంలోని తీరప్రాంతంలో ఏర్పాటైన బావుల నుంచి చమురు వెలికి తీయనున్నారు. తొమ్మిదేళ్లలో  9.56బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల చమురును ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు.