ప్రధాని పదవి కోసం బెంగాల్ ను దళారులకు వదిలేసిన దీదీ

వచ్చే ఎన్నికలలో ప్రధాన మంత్రి పదవి పొందటం కోసం  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్‌ ప్రజలను, ఇక్కడి మధ్యతరగతి, పేదలను దళారీలకు వదిలేశారని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన  జల్‌పాయీగుఢీ జిల్లాలోని మైనాగురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ త్రిపురలో ఎర్రజెండాను నామరూపాల్లేకుండా చేసిన బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోనూ అదే జోరును పునరావృతం చేస్తుందని భరోసా వ్యక్తం చేశారు. 

"దీదీ (మమతా బెనర్జీ) ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాత్రం ఆమె పట్టించుకోట్లేదు. రాష్ట్రంలో హింసాయుత వాతావరణాన్నే ఆమె ప్రోత్సహిస్తున్నారు" అంటూ మండిపడ్డారు. 

 ‘‘పేద ప్రజలను దోచుకున్న వారికి మద్దతుగా ఓ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం ఇదే మొదటిసారి. ఈ రాష్ట్ర ప్రభుత్వం హింసాయుత సంస్కృతిని అవలంబిస్తోంది. పశ్చిమ బెంగాల్‌ ప్రతిష్ఠను మసకబార్చేలా చేస్తోంది" అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతా పోలీస్‌ కమీషనర్‌ నివాసంపై సీబీఐ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నాతో రాజకీయ దుమారం నెలకొన్న అనంతరం ప్రధాని బెంగాల్‌లో పాల్గొన్న తొలి ర్యాలీ ఇదే కావడం గమనార్హం.

 పేదల సొమ్మును లూటీ చేసిన వారిని సమర్దిస్తూ ఆమె ధర్నా చేపట్టారని ధ్వజమెత్తారు. అవినీతిపరులను కాపాడేందుకు తొలిసారిగా ఓ సీఎం ధర్నా చేశారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ ప్రభుత్వం కమ్యూనిస్టుల బాటలో పయనిస్తోందన్నారు. కమ్యూనిస్టులకు బీ టీమ్‌గా తృణమూల్‌ కాంగ్రెస్‌ తయారైందని మండిపడ్డారు. 

మమతా సారథ్యంలోని తృణమూల్‌ ప్రభుత్వం చొరబాటుదారులను స్వాగతిస్తూ బీజేపీ నేతలను రాష్ట్రంలో పర్యటించకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ అంటే తృణమూల్‌ ఉలికిపాటుకు ఇదే సంకేతమన్నారు. స్కామ్‌స్టర్‌లను కాపాడే వారెవరినీ తాను విడిచిపెట్టనని హెచ్చరించారు. సిద్ధాంత వైరుధ్యాలు కలిగిన పార్టీలు మహాకూటమి అంటూ ప్రజల ముందుకొచ్చాయన్నారు.  

కాంగ్రెస్‌, లెఫ్ట్‌, తృణమూల్‌తో బెంగాల్‌ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని దుయ్యబడుతూ వారికి పేదల ప్రజల సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదని విమర్శించారు. బెంగాల్‌లో కొన్నేళ్లుగా శాంతిభద్రతల సమస్యలు నెలకొంటున్నాయని చెబుతూ రాష్ట్రంలో అధికార పక్షమే  గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. 

ఈ రాష్ట్రంలో హింసాయుత వాతావరణం, నియంతృత్వం ఉంది. టీఎంసీ, సీపీఎంలలో ఏ ప్రభుత్వమూ ఇక్కడి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదని ప్రధాని నిశితంగా విమర్శించారు. మమతా బెనర్జీ భయపడుతున్నారని చెబుతూ అయితే తనను చూసి కాదని, ఈ రాష్ట్ర ప్రజలను చూసి. అధికారం నుంచి దూరం చేస్తారనే భయం ఆమెకు పట్టుకున్నదని ప్రధాని ఎద్దేవా చేశారు.  

అవినీతికి పాల్పడ్డవారిని ఈ కాపలాదారుడు వదిలిపెట్టడని పేర్కొంటూ కుంభకోణాల కారణంగా బాధితులుగా మిగిలిన ప్రజలను న్యాయం చేకూరుస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు. అవినీతిపరులంతా  తనను  చూసి భయపడుతున్నారని మోదీ తెలిపారు.