యూపీలో 74 స్థానాల్లో గెలుపొందుతాం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో బిజెపి 74 స్థానాల్లో విజయం సాధిస్తుందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో   ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌, జైన్‌పూర్‌ జిల్లాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ  ‘బీఎస్పీ-ఎస్పీ కూటమిని చూసి బిజెపి కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా వ్యక్తం చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 50 శాతం ఓట్లను రాబట్టేందుకు భాజపా సిద్ధంగా ఉంది. గతంలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం కలిశాయి. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడ మాఫియా అనేదే లేకుండా పోయింది.

‘రాజ వంశాలకు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యతనిస్తుంది. కానీ, బిజెపి  అలా కాదు.. ప్రజాస్వామ్యం ఆధారంగా నడుచుకుంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశ భద్రత మరింత పటిష్టమైంది' అని తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు చేతులు కలపడంపై ప్రస్తావిస్తూ  ఉత్తరప్రదేశ్‌లో మమత కానీ చంద్రబాబు కానీ, ఇతరులు కానీ చేసే ప్రచారం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. సొంత గడ్డపైనే ఆ నేతల్నందరినీ 2014 ఎన్నికల్లో బీజేపీ మట్టి కరిపించిందని గుర్తు చేసారు. 'దేవెగౌడ లక్నోలో ప్రచారం చేస్తే ఒరిగేదేముంటుంది? మమతా దీదీ కాశీ వచ్చినా, చంద్రబాబు మీర్జాపూర్ వచ్చినా, స్టాలిన్ జాన్‌పూర్‌లో ప్రచారం చేసినా తేడా ఏమీ ఉండదు. ఎలాంటి కొత్త పరిణామాలు చోటుచేసుకోవు' అని స్పష్టం చేసారు. 

2014లో ఈ నేతల్నందర్నీ వాళ్ల సొంత రాష్ట్రాల్లోనే బీజేపీ ఓడించి విజయం సాధించిందిని గుర్తు చేశారు. అయోధ్యలో రామాలయం అంశాన్ని ప్రస్తావిస్తూ 'అదే స్థలంలో దివ్యమైన రామాలయం కట్టడానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ తమ సంకల్పాన్ని ఎవరూ అంగుళం కూడా కదిలించలేరని చెప్పారు. రామాలయం నిర్మాణంపై సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ తమ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆయన మరోసారి సవాల్  చేశారు.

ఎస్పీ, బీస్పీలు అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్‌లా పరిగణిస్తాయని ధ్వజమెత్తుతూ తమ పార్టీ చొరబాట్లను జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తుందని  అమిత్ షా పేర్కొన్నారు. అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదాను విడుదల చేయడంతో 40 లక్షల మంది చొరబాటుదార్లు బయటపడ్డారని గుర్తు చేసారు. 

బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అసోం నుంచి గుజరాత్‌ వరకు, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ వరకు అక్రమ చొరబాటుదార్లందరి పని పడుతుందని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తోందని చెబుతూ వారి కోసం చాలా రకాల పథకాలు అమలు చేస్తోందని అమిత్‌ షా వివరించారు.