చికిత్సకోసం మరోసారి అమెరికాకు పారికర్

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మెరుగైన వైద్యం కోసం ఆయన మళ్లీ అమెరికాకు వెళ్తున్నారు. ఈరోజు రాత్రి ఆయన అమెరికాకు బయలుదేరనున్నట్లు పారికర్‌ కార్యాయలం బుధవారం వెల్లడించింది. 62ఏళ్ల పారికర్‌ ఇటీవల అమెరికాలో క్లోమ గ్రంథి సంబంధిత సమస్యకు చికిత్స చేయించుకుని తిరిగి వచ్చారు. జూన్‌లో ఆయన భారత్‌కు వచ్చారు. ఈ నెలలో మరోసారి చెకప్‌ కోసం అమెరికా వెళ్లారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే ఆగస్టు 23న సాధారణ రివ్యూ హెల్త్‌ చెకప్‌ కోసం ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి వెళ్లిన పారికర్‌ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన బుధవారం తిరిగి గోవాకు వెళ్లాల్సి ఉండగా మరోసారి చికిత్స కోసం అమెరికాకు వెళ్తున్నారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. పారికర్‌ ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించలేదని తన వద్దే ఉంచుకున్నారని, ఇతరులకు అప్పగించాల్సినంత అవసరం ఏమీ లేదని అధికార వర్గాలు తెలిపారు.