అవినీతికి పాల్పడడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా

అవినీతికి పాల్పడడమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతికి పాల్పడ్డవారికి ఆ పార్టీ సాయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని అంటోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యారోగ్య పథకాలు ఈ రాష్ట్రానికి వద్దని చెబుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేం కూడా వారికి అభినందనలు తెలిపాం. రాష్ట్రాభివృద్ధి కోసం వారు కూడా కొన్ని మంచి పనులు చేస్తారని అనుకున్నాం. కానీ, కేంద్ర సర్కారు అందిస్తున్న పథకాల ప్రయోజనాలు అందకుండా చేయడమే వారి పనిగా మారింది’’ అని మోదీ విమర్శించారు. 

‘‘నేను వారిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు ఉన్న సమస్య ఏంటి? పేద ప్రజలు నాకు మద్దతు తెలుపుతున్నారని కాంగ్రెస్‌కి తెలుసు. అందుకే, వారు ఇటువంటి పనులు చేస్తున్నారు" అంటూ చురక అంటించారు. కాంగ్రెస్‌కి ఓ విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నానని చెబుతూ మీరు దేశాన్ని 55 ఏళ్ల పాటు పాలించి నాశనం చేశారని మండిపడ్డారు.

తాము పేద ప్రజల్లో ఆశలు చిగురింప చేసి వారి సమస్యల నివారణ కోసం పని చేస్తున్నామని ప్రధాని చెపాప్రు. పేదరికంపై ప్రజలు పోరాడి సాధికారత సాధించేలా చేశామని తెలిపారు . సీబీఐ వంటి వ్యవస్థలను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారని,  ఎందుకంటే తాము అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ తమ అవినీతి ఖజానాకు ఏటీఎంలా వినియోగించుకోవాలనుకుంటోందని మోదీ దుయ్యబట్టారు.

తనపై విమర్శలు చేసే పనిలో కాంగ్రెస్‌ నేతలు పోటీ పడుతున్నారని చెబుతూ ఉదయం నుంచి రాత్రి వరకు మోదీ-మోదీ అంటూ తన నామ జపమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడడం... అవినీతికి పాల్పడేవారికి సాయం చేయడమే వారి అజెండా అంటూ ప్రధాని ధ్వజమెత్తారు. అయితే తానో విషయం చెప్పదలుచుకున్నానని, ఈ కాపలాదారుడు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాడని హెచ్చరించారు.

రైతులను కాంగ్రెస్‌ తమ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని ప్రధాని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అంటూ మభ్యపెడుతోందని అంటూ మీలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా? అని ప్రధాని ప్రశ్నించారు. బిజెపి ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెట్టబోదని,  రైతుల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. 

బడ్జెట్‌లో రైతులు, పేదల కోసం బడ్జెట్‌లో పలు పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేస్తూ "ఈ కాపలాదారుడు మీ కోసమే పనిచేస్తాడు. ఎందుకంటే మీరు సమర్థమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు" అని పేర్కొన్నారు. అవినీతి పార్టీలు, నేతలు కలిసి బిజెపిని ఓడించాలని కలుస్తున్నాయని ప్రధాని హెచ్చయిరాలు. మీరు ఆ ప్రతికూల శక్తులను ఓడించాల్సి ఉందని ప్రజలకు పిలుపిచ్చారు. ఆ పార్టీలు దేశంలోని ప్రజాస్వామ్యాన్ని అవినీతిమయం చేస్తాయని మోదీ విమర్శించారు.