12 నుంచి మేరా పరివార్..బీజేపీ పరివార్

త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ‘మేరా పరివార్ బీజేపీ పరివార్’ పేరిట ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12వతేదీ నుంచి మార్చి 2వతేదీ వరకు ఇంటింటిపై బీజేపీ జెండాలు ఎగురవేయాలని బీజేపీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమలో భాగంగా 5 కోట్ల ఇళ్లపై బీజేపీ జెండాలు ఎగురవేస్తామని చెబుతున్నారు.

ఈ సందర్భంగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఆర్గినైజింగ్ కార్యదర్శులు, ఇతర పార్టీ నేతలతో గురువారం సాయంత్రం సమీక్షించారు. ‘ మేరా పరివార్- బీజేపీ పరివార్ ’ పేరిట బీజేపీ అభిమానులు అంతా తమ ఇళ్లపై బీజేపీ జండాలను ఎగురవేయాలని, మరో పక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాలని సూచించారు.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని అమిత్ షా సూచించారు. మేరా పరివార్ - బీజేపీ పరివార్ కార్యక్రమం ముగింపు రోజైన మార్చి 2వ తేదీన 4100 అసెంబ్లీల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోగానే బూత్ స్థాయి కమిటీలు, శక్తి కమిటీలు, నియోజకవర్గాల వారీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న సమర్పణ దివస్ నిర్వహించాలని, ఫిబ్రవరి 28న కమల జ్యోతి కార్యక్రమం నిర్వహించాలని వివరించారు.

ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఇళ్లల్లో దీపాల పండుగగా నిర్వహించాలని, నా ఇల్లు- బీజేపీ ఇల్లు అని దేశవ్యాప్తంగా ఇంటి మీద జండా పండుగ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో మార్చి 2వ తేదీలోగా మేథావులతో భేటీలు నిర్వహించాలని సూచించారు. నరేంద్రమోదీ తిరిగి పూర్తిస్థాయిలో మంచి మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడానికి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.