మహాకల్తీ కూటమి ...ప్రజాస్వామ్యం దానిని తిరస్కరిస్తుంది

 బీజేపీకి వ్యతిరేకంగాప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్నది మహాకల్తీ కూటమి అని, ఆరోగ్యవంతమైన మన ప్రజాస్వామ్యం దానిని తిరస్కరిస్తుందని ప్రధాన మంద్రి నరేంద్ర  మోదీ భరోసా వ్యక్తం చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ  ప్రతిపక్షపార్టీలపై విరుచుకుపడ్డారు.

ఎమర్జెన్సీని విధించి, న్యాయవ్యవస్థను బెదిరించి, ఎన్నికల సంఘంపై విమర్శలు చేసి, సాయుధ దళాలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీ తనను రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేశాడంటున్నదని ప్రధాని  విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ది అధికారం కోసం పాకులాడే తత్వమని, తమది సేవాభావమని చెప్పారు. రాఫెల్ ఒప్పందాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్.. ఎవరి కోసం సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నదని నిలదీశారు.

దేశంలో ఎమర్జెన్సీ విధించినవారు, న్యాయవ్యవస్థను బెదిరించిన వారు, సైన్యాన్ని అవమానించిన వారు నేడు తనను రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నానంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్ నేతలకు భారత నౌకా దళం మరింత శక్తిమంతం కావడం ఇష్టం లేదని మండిపడ్డారు. ఏ కంపెనీలకు ఆ కాంట్రాక్టును కట్టబెట్టాలని ఇంత సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 

దాదాపు 100 నిమిషాలు మాట్లాడిన ప్రధాని తన ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేశారు. తన 55 నెలల పాలనను కాంగ్రెస్ 55 ఏండ్ల పాలనతో పోల్చారు. వారిది సత్తా భోగ్ (అధికార సంబురం), నాది సేవా భావ్ (సేవాభావం) అన్నారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చి వారి రాచరికాన్ని సవాలు చేసినందుకే తనపై కక్షగట్టారని చెప్పారు.బీసీ (క్రీస్తు పూర్వం), ఏడీ (క్రీస్తు శకం)కు ప్రధాని మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ (కాంగ్రెస్‌కు పూర్వం), ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ (కాంగ్రెస్ వంశ పాలన తరువాత)అని అన్నారు. 

 కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది. ఆర్మీ చీఫ్‌ను గూండా అని అవమానించింది. ఎన్నికల కమిషన్‌పై, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు రాజ్యాంగ సంస్థలను మోదీ ధ్వంసం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నది అంటూ ప్రధాని విరుచుకుపడ్డారు.

 న్యాయవ్యవస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తారు. ప్రణాళికా సంఘాన్ని జోకర్ల గుంపు అని వ్యాఖ్యానిస్తారు.. మళ్లీ రాజ్యాంగ సంస్థలను మోదీ ధ్వంసం చేస్తున్నారని చెప్తారు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. స్వయంగా ఇందిరాగాంధీ 50సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు అని మోదీ చెప్పారు.   

కోల్‌కతాలో ఇటీవల మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభపై కూడా మోదీ విమర్శలు సంధించారు. కోల్‌కతాలో సమావేశమైన వారితో కూడిన మహా కల్తీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. ప్రభుత్వం భారత ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల ఆకాంక్షల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అవినీతికి తావుండరాదు. మేము దేశం లోపల ఉన్నా బయటకు వెళ్లినా, పార్లమెంట్ లోపల ఉన్నా, వెలుపల ఉన్నా నిజమే మాట్లాడుతాం. కానీ నిజాన్ని వినే సహనం మీలో నశించింది అంటూ ఆయన నిప్పులు చెరిగారు.

 కాంగ్రెస్ సైన్యాన్ని బలహీనపరచిందని, అందుకే లక్షిత దాడులపై సందేహాలు వ్యక్తం చేసిందని ఆరోపించారు. అవినీతిని తాము చాలావరకు అరికట్టామని ప్రధాని చెప్పారు. దేశాన్ని లూటీ చేసినవారు తనను చూసి భయపడుతూనే ఉంటారని అన్నారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి, అవినీతిపరులకు అండగా నిలిచాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ అవినీతిపరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కేసులో విదేశాల నుంచి నిందితులను పట్టుకొస్తుండటంతో ప్రతిపక్షంలోని కొందరిలో వణుకు పుడుతున్నదని అన్నారు.   

గత నాలుగున్నరేండ్లలో కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వచ్చాయని ప్రధాని స్పష్టం చేశారు. ఇటు సంఘటిత, అటు అసంఘటిత రంగంలో ఎంతోమంది ఉపాధి పొందారని తెలిపారు. ఇందుకు భవిష్య నిధి, జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్) ఆదాయం పన్ను చెల్లింపులు, వాహనాల అమ్మకాల గణాంకాలను ఉదహరించారు. 2018 నవంబర్ నాటికి 1.8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)లో మొదటిసారిగా చేరారని చెప్పారు. ఎన్‌పీఎస్‌లో కొత్తగా 55 లక్షల మంది ఉద్యోగులు చేరారన్నారు. గత నాలుగేండ్లలో 6.35 లక్షల మంది కొత్తగా ఆదాయం పన్ను చెల్లించారని చెప్పారు. 

కొత్తగా ఉద్యోగాలొచ్చాయనడానికి ఇవన్నీ నిదర్శనం కాదా? అని ప్రధాని ప్రశ్నించారు. ఇక అసంఘటిత రంగం గురించి వివరిస్తూ, భారీ ట్రక్కులు/వాణిజ్య వాహనాలు 36 లక్షలు, 1.5 కోట్ల ప్రయాణికుల వాహనాలు, 27 లక్షల ఆటోలు అమ్ముడు పోయాయి. ఈ వాహనాల ద్వారా ఉపాధి లభించలేదా? అంటూ ధ్వజమెత్తారు. హోటల్ పరిశ్రమ ద్వారా 1.25 కోట్లు, పర్యాటక రంగం ద్వారా 1.5 కోట్లు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.