కర్ణాటక అసెంబ్లీలో రభస.. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందన్న బిజెపి

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినదని, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అధికారం లేదని బిజెపి సభ్యులు ఆందోళన చేస్తూ ఉండడంతో హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వం ప్రారంభించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండు రోజులుగా సాగడం లేదు. 10 రోజుల సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో బుధవారం ప్రారంభం కాగా, బిజెపి సభ్యుల నినాదాలతో ఆయన 10 నిముషాల లోపే తన ప్రసంగం ముగించి వెళ్లిపోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా సుమారు 10 మంది సభ్యులు రెండు రోజులుగా సమావేశాలకు హాజరు కాకపోవడంతో సంకీర్ణం మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినదని బిజెపి సభ్యులు ఆరోపిస్తున్నారు. బిజెపి సభ్యుల నినాదాల మధ్య రెండు రోజు కూడా స్పీకర్ కె ఆర్ సురేష్ కుమార్ సభను వాయిదా వేయవలసి వచ్చింది. 14 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ పార్టీని వీడారని బిజెపి సభ్యులు ఆరోపిస్తున్నారు.

"గో బ్యాక్ సీఎం, గో బ్యాక్ సి ఏం', `దిగి పోవాలి సీఎం, దిగి పోవాలి సీఎం', `మెజారిటీ  లేని ప్రభుత్వం దిగి పోవాలి' అంటూ బిజెపి సభ్యుల నినాదాలతో సభ మారుమ్రోగి పోయింది. సభ్యులను తమ సీట్లలో కూర్చోమని స్పీకర్ కోరినా వినిపించుకోలేదు. కాగా, ఆర్ధిక శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టవలసి ఉంది.

ఏడు నెలల క్రితం ఏర్పడిన కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదని అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత అశోక్ రెండు రోజుల కృష్ణ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేలోపే ఈ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు.

ఈ పరిణామాలతో ఖంగుతున్న కాంగ్రెస్  శుక్రవారం తన శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్యెల్యేలు అందరు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. నలుగురు సభ్యులు ఇప్పటికి పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేరని తెలుస్తున్నది.