అధికారంలోకి వస్తే రూ 3,000 పెన్షన్లకు జగన్ హామీ

ఎన్నికల ముందు లబ్ది పొందటమే కోసం వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న సాంఘిక సంక్షేమ పెన్షన్ లను ఒకేసారి రూ 1,000 నుండి రెట్టింపు చేసి రూ 2,000 చొప్పున ఇవ్వడం ఈ నెల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే, ఈ సారి ఎట్లాగైనా అధికారం చేపట్టాలని పట్టుదలగా కృషి చేస్తున్న ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఏకంగా రూ 3,000 చొప్పున చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల ఆధరాభిమానాలు, భగవంతుని ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి నెలా రూ.3వేలు పెన్షన్లు చెల్లిస్తానని వెల్లడించారు.  వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి బుధవారం ఎన్నికల సమరశంఖారావాన్నిపూరించారు.

గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలను నమ్మించి వంచించాడని, ఎన్నికలు సమీపిస్తుండంతో మాయాజాల పథకాలతో మరోమారు మోసం చేయడానికి తెగబడుతున్నాడని దుమ్మెత్తి పోశారు. బాబు మాటలు నమ్మి మరోమారు మోసపోకండని ప్రజలను హెచ్చరించారు. మీ దీవెనలతో అధికారంలోకి వచ్చి మీ కలలను సాఫల్యం చేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర అనంతరం తాను ప్రకటించిన నవరత్నాల పథకాలను బాబు కాపీ కొట్టి హడావుడిగా అమలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అది కూడా ఎన్నికలు ముగిసిన తరువాత వాటికి తిలోదకాలు ఇచ్చే ఘనచరిత్ర బాబుకు ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

బాబు ఐదేళ్ల పాలనను జగన్ మూడు రకాల సినిమాలుగా వర్ణించారు. తొలుత 2014 ఎన్నికలకు ముందు అధికారం కోసం బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాడని.. రాష్ట్ర ప్రజల అభీష్టమైన ప్రత్యేక హోదాను అటకెక్కించి ప్రత్యేక ప్యాకేజీ అంటూ డప్పు కొట్టాడని గుర్తు చేశారు. ఆయన డప్పుకు రెండు ఎల్లో మీడియా పత్రికలు, టీవీలు వంత పాడాయన్నారు. ఎన్నికలకు ఆరు నెలలు ఉండగా ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ, జనసేనలకు దూరమైనట్లు డ్రామా ఆడారని చెప్పారు.

ఇక అక్కడ నుంచి రెండో సినిమాకు తెరతీశాడన్నారు. ఇందులో పునాదులు కూడా పూర్తికాని పోలవరాన్ని జాతికి అంకితం చేశాడని,  ప్రత్యేక హోదా అంటూ నల్ల చొక్కాలు వేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇక మూడవ సినిమా ఏమిటంటే 3648 కిలోమీటర్ల దూరం నడిచిన తాను ప్రజల కష్టాలను చూశానని తెలిపారు. ప్రభుత్వ పథకాల ఎలా పసుపుచొక్కాల పరమై అర్హులైన ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో గమనించానని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో ప్రజలను ఎలా దోచుకుంటున్నారో గుర్తించానని పేర్కొన్నారు.

తాను అధికారంలోకి వస్తే  కులం, మతం, వర్గం, వర్ణం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రజా సంక్షేమమన్న బాబు అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రాన్ని నిట్టనిలువునా దోచుకున్నాడని ధ్వజమెత్తారు. ఆ డబ్బుతో రానున్న ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి రావడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఇందులో భాగంగా చేయకూడని పనులు చేస్తాడని, వైసీపీకి  సానుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగిస్తాడని ఆరోపించారు. ఇప్పటికే 59 లక్షల ఓట్లను తొలగించి వాటి స్థానంలో దొంగ ఓట్లను ఎక్కించాడని చెప్పారు. 

డ్వాక్రా మహిళలకు సంబంధించి నాడు రూ.14వేల కోట్లు అప్పుంటే నేడు అది వడ్డీ తడిసి మోపెడై రూ.25వేల కోట్లకు చేరిందని చెబుతూ ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ మరో మోసానికి బాబు తెగబడుతున్నాడని విమర్శించారు. అదే క్రమంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో ఆరో బడ్జెట్‌ను అనధికారికంగా ప్రవేశ పెట్టాడని ధ్వజమెత్తారు. బాబు రైతులకు చెవిలో పువ్వులు పెట్టే కార్యక్రమానికి తెర లేపారని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ఒక కోటి 70 లక్షల మందికి రూ. 2వేలు చొప్పున పెన్షన్లు ఇస్తున్నట్లు బాబు ప్రకటించారని చెబుతూ ఇదంతా కూడా కేవలం ఎన్నికల వరకేనని అటు తరువాత మూడు లక్షల మందికి మించి పెన్షన్ ఇవ్వకుండా అంతర్గత ప్రణాళికలు రూపొందించుకున్న ఘనుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. 57 నెలలుగా ఏమీ చేయలేని బాబు మూడు నెలల ఎన్నికల కోసం ఆరు నెలలుగా పథకాలను ప్రకటించడం చూస్తుంటే ‘అమ్మకు అన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకు చీర కొనిపెడతా’నని చెప్పినట్లు ఉందని చమత్కరించారు.