విభజన హామీల అమలుపై 18న కేంద్రం సమీక్ష


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 అమలుపై ఈనెల 18న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. చట్టం అమలుపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు పేర్కొంది. టిడిపి  సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విభజన చట్ట హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే చాలావరకు అమలయ్యాయని చెప్పారు.

‘భోగాపురం’ వేగవంతం చేసే బాధ్యత రాష్ట్రానిది

 విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని వేగవంతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కేంద్రం తెలిపింది. పీపీపీ బిడ్డింగ్‌ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని రాజ్యసభలో తెదేపా సభ్యుడు టీజీ వెంకటేశ్‌కు పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ప్రభు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఏపీ ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది

ఆంధ్రప్రదేశ్‌లో అధునాతన గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూమి అప్పగింతతోపాటు కొన్ని తప్పనిసరి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కేంద్రం తెలిపింది. టిడిపి సభ్యుడు వైఎస్‌ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ ఈ మేరకు రాజ్యసభలో సమాధానమిచ్చారు. రూ.219.16 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఈఎస్‌ఐ ఆసుపత్రులు 

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, విజయనగరం, పెనుకొండ... తెలంగాణలోని రామగుండంలలో 100 పడకల ఆసుపత్రులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తాడేపల్లిగూడెంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు స్థాయి లేదని, శ్రీసిటీలో ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

33 రైల్వే ప్రాజెక్టులు

 ఆంధ్రప్రదేశ్‌లో 33 కొత్త రైల్వే లైన్లు/డబ్లింగ్‌ ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలవుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఏపీలో మౌలిక సదుపాయాలు, భద్రతకు 2018-19లో రూ.3670 కోట్లు కేటాయించినట్లు టిడిపి  సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్‌ గొహైన్‌ లోక్‌సభకు తెలిపారు.

ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని, దాని స్థానంలో ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం పునరుద్ఘాటించింది. లోక్‌సభలో టిడిపి ఎంపీ మురళీమోహన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు 2015 నుంచి 2020 వరకు రెవెన్యూ లోటు గ్రాంటుగా రూ.22,112 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని తెలిపారు. ప్యాకేజీ రూపంలో 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రానికి విదేశీ సహాయ ప్రాజెక్టుల్లో అదనపు కేంద్ర వాటా లభిస్తుందని చెప్పారు.

నాలుగేళ్లలో రూ.628 కోట్ల ఎంపీ నిధులు 

ఆంధప్రదేశ్‌లో ఎంపీల్యాడ్స్‌ కింద గత నాలుగేళ్లలో మొత్తం రూ.628.17 కోట్లు ఖర్చుచేసి 17,513 పనులు పూర్తిచేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్‌ గోయెల్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ 2015-16 నుంచి 2018-19 వరకు రాష్ట్రానికి రూ.590 కోట్లు ఎంపీల్యాడ్స్‌ కింద కేంద్రం మంజూరు చేయగా, పాత నిధులతో కలిపి రూ.628.17 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.