ముందస్తుకై స్పష్టత లేకుండానే సన్నాహాలలో కెసిఆర్

వెంటనే రాష్ట్ర శాసన సభను రద్దు చేసి, డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాలుగు రాస్త్రాలతో పాటు ముందస్తు ఎన్నికలు జరిగేటట్లు చూడటం కోసం కసరత్తు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తటపాయిస్తున్నట్లు కనబడుతున్నది. ఈ విషయమై భరోసా కోసం మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతరులను కలసి వచ్చినా ఆయనలో అసెంబ్లీ రద్దు చేస్తే డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం కుదిరిన్నట్లు కనబడటం లేదు.

అందుకనే ముందస్తు ఎన్నికలు అన్నవి పత్రికల సృష్టి అని, తామెప్పుడు `అధికారికం’గా చెప్పలేదని అంటూ మంత్రి కే టి రామారావు, ఎంపి బి వినోద్ కుమార్ వంటి వారు అంటున్నారు. అయితే ఈ విషయమై పది రోజులలో స్పష్టత వస్తుందని కేటిఆర్ చెప్పగా, ముందస్తు ఆలోచన ఉన్నదని వినోద్ కుమార్ అంగీకరించారు. ముఖ్యమంత్రి సహితం ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ నరసింహన్, సీనియర్ అధికారులతో ఈ విషయమై మంతనాలు జరుపుతున్నారు.

ఏది ఏమైనా సెప్టెంబర్ 2న జరుపుతున్న `ప్రగతి నివేదిన’ బహిరంగ సభ లోగా ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే ముందస్తు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని మంజూరు చేయమని ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గం సహితం ఒకటి, రెండు రోజులలో సమావేశమై మరిన్న వరాలను ప్రజలపై కురిపించే ప్రయత్నం చేస్తున్నది.

అర్ధంతరంగా 11 జిల్లాల కల్లెక్టర్లను బదిలీ చేసారు. ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర కీలకం కావడంతో ముక్కు సూటిగా పోయే వారికి స్థానచలనం తప్పలేదు. ఇక ఎన్నికల పక్రియలో కీలకం కానున్న జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ డివిజినల్‌ అధికారులు, డీఎస్పీలను సహితం పెద్ద ఎత్తున బదిలీ చేయడం కోసం కసరత్తు చేస్తున్నారు.

గత రాత్రి గవర్నర్ తో రెండు గంటల పాటు సమావేశమైన కెసిఆర్ ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన్నట్లు తెలుస్తున్నది. ముందస్తుకు కోసం అసెంబ్లీని రద్దుకు సిఫార్సు చేసే ముందు నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కుడా జరిపే ప్రయత్నం చేస్తున్నారు.

నాలుగు రాష్త్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసిన ఎన్నికల కమీషన్ ఇప్పుడు అసెంబ్లీ ని రద్దు చేస్తే తెలంగాణకు వాటితో పాటు ఎన్నికలు జరిపే అవకాశమై స్పష్టమైన హామీ ఇవ్వక పోవడం ప్రధానంగా కెసిఆర్ ను ఆందోళనకు గురి చేస్తున్నది. వోటర్ల జాబితా సవరణలు పూర్తి చేసుకొనే సరికి జనవరి దాటుతుందని, ఆ తర్వాత అంటే లోక్ సభతో పాటే ఎన్నికలు జరుపకుండా, ముందుగా ప్రత్యేకంగా జరిపే అవకాశం లేదని ఉన్నతాధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. దానితో ముందస్తు ఎన్నికలపై అధికార పార్టీ వర్గాలలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో, రాష్ట్రపతి ప్రకటన పూర్తి కాగానే సుమారు 40 వేల ఉద్యోగాల నీయమకం జరిపే అవకాశం ఉంటుంది, అది ఎన్నికలలో ప్రధాన ప్రచార అస్త్రం కాగలదని కెసిఆర్ భావిస్తున్నారు.