మమతను గద్దె దించే వరకు పోరాటం ఆపబోము

పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేసారు. ‘‘మీరు మమ్మల్ని ఆపడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, మేం అంత తరచూ బెంగాల్ వస్తూ ఉంటాం’’ అని మమత బెనర్జీని ఉద్దేశించి హెచ్చరించారు.

కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణించి, ఖరగ్‌పూర్ చేరుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల బీజేపీ నేతల హెలికాప్టర్లు పశ్చిమ బెంగాల్‌లో దిగడానికి అనుమతులు నిరాకరించడంపై చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మహాకూటమిపై మండిపడుతూ పెళ్ళి కొడుకు లేని వివాహ విందు అని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారో చెప్పాలని మమతను డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లా, బహ్రంపూర్‌లో హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చౌహాన్ పాల్గొనవలసిన బహిరంగ సభ రద్దయింది.

దీదీకి అమిత్‌ షా వార్నింగ్‌

మరోవంక, బీజేపీ నేతలను, కార్యకర్తలను రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తన చర్యలతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు. బెంగాల్‌లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక ఆమె బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారని అలీగఢ్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్‌ షా ధ్వజమెత్తారు. 

బెంగాల్‌లో 42 లోక్‌సభ స్ధానాలకుగాను 23 స్దానాల్లో కమలం విరబూసేవరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించబోరని ఆమెకు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ‘బెంగాల్‌లో నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అనుమతించకుండా అడ్డంకులు సృష్టించారు..నా హెలికాఫ్టర్‌ ల్యాండయ్యేందుకు అనుమతించలేదు..శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంద’ని నిశితంగా విమర్శించారు. 

ప్రధాని సభకు చిన్న మైదానం కేటాయించి, దానికి అనుమతులు సైతం అర్ధరాత్రి ఇచ్చారని మమతా సర్కార్‌పై ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ సత్తా చాటనుందనే ఆక్రోశంతోనే దీదీ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీస్‌ అధికారికి వత్తాసు పలుకుతూ కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నా చేయడం పట్ల అమిత్‌ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.