రాబర్ట్ వాద్రా రోడ్‌పతి నుంచి క్రోర్‌పతి ఎలా అయ్యారు

 కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు తొలిసారి విచారణకు హాజరైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది. రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్‌తో పాటు చాలా రక్షణ ఒప్పందాలతో సంబంధం ఉందని బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్ పాత్ ఆరోపించారు. భారత వాయు సేనకు పిలాటస్ ట్రైనర్ విమానం కొనుగోలు ఒప్పందంతో కూడా వాద్రాకు సంబంధం ఉందన్నారు. వివిధ కంపెనీల ద్వారా వాద్రా భారీగా సొమ్మును అక్రమంగా మళ్ళించారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మొదటి కుటుంబం బెయిలు కుటుంబమని పేర్కొంటూ రోడ్డుపతి వంటి రాబర్ట్ వాద్రా క్రోర్‌పతి (కోటీశ్వరుడు) ఎలా అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా ఇద్దరు నేరగాళ్ల పోస్టర్‌ను పెట్టారని, వారిద్దరూ బెయిలుపై వచ్చారని ఎద్దేవా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో సంబంధం ఉన్న రాహుల్ గాంధీ క్రిమినల్ నెంబర్ వన్ అని, బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమక్షంలో హాజరుకాబోతున్న రాబర్ట్ వాద్రా క్రిమినల్ నెంబర్ 2 అని దుయ్యబట్టారు. 

రాబర్ట్ వాద్రాను ప్రశ్నించడంకోసం ఈడీ సమ్మన్లు జారీచేయగా వాద్రా ముందస్తు బెయిలు కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అయితే దర్యాప్తు సంస్థతో సహకరించాలని వాద్రాను కోర్టు ఆదేశించింది.

అయితే ఈడీ విచారణకు వాద్రా ఒంటరిగా రాలేదు. సెంట్రల్ ఢిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి తన భార్య, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వచ్చారు. తన భర్తను ఈడీ కార్యాలయం ముందు కారులో డ్రాప్ చేసిన ప్రియాంక గాంధీ అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ, ఏమి జరుగుతోందో ప్రపంచానికంతా తెలుసునని అన్నారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాతనే ఆమె ఎసిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

లండన్‌కు చెందిన ఆస్తిని 1.9 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసిన కేసులో ఈడీ విచారణను రాబర్ట్ వాద్రా ఎదుర్కొంటున్నారు.  కాగా, రాబర్ట్ వాద్రా సన్నిహిత సహచరుడు మనోజ్ అరోరాకు ఈనెల 16వరకూ అరెస్టు చేయకుండా కోర్టు ఇవాళ తాత్కాలిక రక్షణ మంజూరు చేసింది.