టీఎంసీ గూండాలను తరిమికొడతాం : యోగి ఆదిత్యనాథ్

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండాలను పశ్చిమ బెంగాల్‌ నుంచి తరిమి కొడతామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. పురూలియాలో జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బహిరంగ సభలో  మాట్లాడుతూ భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన గడ్డ ఇది అని ప్రశంసించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారేనని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటమే సరైనదవుతుందని చెప్పారు.

మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటోందని యోగి ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బెంగాల్‌కు పరివర్తన తీసుకొచ్చిందని చెప్పారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడిని కాపాడేందుకు మమత ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 

 పరోక్షంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌తో కలిసి మమత బెనర్జీ ధర్నా చేయడాన్ని ప్రస్తావిస్తూ . అవినీతిపరుడైన అధికారిని కాపాడటానికి మమత ఎందుకు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అవినీతి ప్రభుత్వం నుంచి బెంగాల్ ప్రజలను కాపాడాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే, టీఎంసీ గూండాలను రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు.

 సీబీఐ ఉదంతం నేపథ్యంలో మమతా బెనర్జీ ధర్నా చేపట్టడాన్ని ఆయన ఆక్షేపిస్తూ ముఖ్యమంత్రే ధర్నాకు దిగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అభ్యంతరం వ్యక్తం చేశారు. 

బెంగాల్‌ బంద్‌కు  అల్టిమేటం  

ఇలా ఉండగా, అంతకు ముందు ఆదిత్యనాధ్ ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్‌ బంద్‌కు పిలుపిస్తామని బీజేపీ హెచ్చరించింది. పురూలియా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించేందుకు బెంగాల్‌ అధికారులు ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో మంగళవారం లక్నో నుంచి జార్ఖండ్‌లోని బొకారోకు చాపర్‌లో చేరుకున్న యోగి అక్కడి నుంచి ర్యాలీకి వేదికైన పురూలియాకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.

పురూలియాలో యోగి ర్యాలీని అడ్డుకుంటే బెంగాల్‌ బంద్‌ చేపడతామని బీజేపీ నేత విశ్వప్రియ రాయ్‌ చౌధరి హెచ్చరించారు. మరోవైపు ముర్షిదాబాద్‌లో బీజేపీ ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. గతంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీలకూ బెంగాల్‌ అధికారులు అడ్డంకులు సృష్టించిన సంగతి తెలిసిందే.

 కాగా యూపీలో పరిస్థితిని చక్కదిద్దుకోలేని యోగి బెంగాల్‌ చుట్టూ తిరుగుతున్నారని సీఎం మమతా బెనర్జీ చేసిన విమర్శలను యోగి తిప్పి కొట్టారు. అక్కడ పరిస్థితులు సవ్యంగానే ఉన్నాయని చెప్పారు.