రాహుల్ జీ నీ సర్టిఫికెట్ అక్కర్లేదు : గడ్కరి

భారతీయ జనతా పార్టీలో దమ్మున్న నేత మీరొక్కరేనంటూ రాహుల్ గాంధీ తనను ప్రశంసించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గట్టి కౌంటర్ ఇచ్చారు. 'నీ సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు' అంటే వరుస హిందీ ట్వీట్లలో ఆయన తెగేసి చెప్పారు.

ఇంటిపై శ్రద్ధ చూపలేని వ్యక్తి దేశ పాలన నిర్వహించలేడంటూ గత శనివారంనాడు నాగపూర్‌లో ఏబీవీపీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ గడ్కరి పేర్కొన్నారు. దీనిపై రాహుల్ ట్వీట్ చేస్తూ 'గడ్కరీజీ...మీకు అభినందనలు. బీజేపీలో ధైర్యం గల నేత మీరొక్కరే. దయచేసి రాఫెల్ కుంభకోణం, రైతుల కడగండ్లు, ప్రభుత్వ సంస్థల నిర్వీర్యంపై స్పందించండి' అని ట్వీట్ చేశారు.

రాహుల్ ట్వీట్ బీజేపీలో పొరపొచ్చాలు తెచ్చే అవకాశాలుండటం గమనించిన గడ్కరీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్వీట్లతోనే ఆయనకు ధీటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి తనకు ఎలాంటి సర్టిఫెకెట్ అవసరం లేదని, మీడియా ట్విస్ట్ చేసిన వార్తలు చూసి మోదీ సర్కార్‌పై రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తారని, పూర్తి శక్తిసామర్థ్యాలతో దేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తారని గడ్కరి ధీమా వ్యక్తం చేశారు. 

'రాహుల్ జీ...మీరు ట్విస్ట్ చేసిన మీడియా వార్తలు చూసి మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. మోదీ, మా ప్రభుత్వం సొంత బలంపై ఆధారపడతాం. మీరు ఇతరుల భుజాలను ఆసరాగా తీసుకుంటున్నారు' అని గడ్కరి చురకలు వేశారు.

రాహుల్ లెవనెత్తిన అంశాలపై కూడా గడ్కరి మరో ట్వీట్‌లో స్పందిస్తూ 'దేశ ప్రయోజనాలే ప్రధానంగా రాఫెల్ డీల్‌ను మా ప్రభుత్వం కుదుర్చుకుంది. నిజాయితీతో కూడిన మోదీ విధానాలే రైతులను సంక్షోభం నుంచి బయటపడేశాయి. మీ (కాంగ్రెస్) విధానాలు అందుకు భిన్నం' అని భరోసా వ్యక్తం చేసారు. 

మోదీ మళ్లీ ప్రధాని కానుండటాన్ని మీరు భరించలేకుండా ఉన్నారంటూ రాహుల్ పై విరుచుకు పడ్డారు. దీంతో మీరు అసహనం, వ్యవస్థల నిర్వీర్వం అంటూ ఏవేవో కలల్లో తేలుతున్నారంటూ మండిపడ్డారు. రాహుల్‌కు హితవు పలుకుతూ...మునుముందైనా మీరు హేతుబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ ట్వీట్ ముగించారు.