ఏపీలో లక్షల్లో నకిలీ ఓట్లు ... డిజిపిని మార్చండి

ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారని, ప్రస్తుతం 59.18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు.  మరోవైపు రకరకాల సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావులను వెంటనే బదిలీ చేసి ఎన్నికల సంబంధ విధులలో లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. 

వైఎస్‌ జగన్‌ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను కలిసి అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ పలు ఆధారాలతో  ఫిర్యాదు చేసింది. 

‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా ధిక్కరిస్తుందో ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చారు. ఓటర్ల లిస్టును ఎలా తారుమారు చేస్తున్నారో ఈసీకి వివరించాం. సెప్టెంబర్‌ 2018 నాటికి 52 లక్షల 67వేల నకిలీ ఓట్లు చేర్చారు. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరింది. మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు'  అని జగన్ తర్వాత తెలిపారు. 

దాదాపు 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ, తెలంగాణలో డబుల్‌గా నమోదయ్యాయి. ప్రజా సాధికార సర్వే, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) డేటాబేస్‌, పరిష్కార వేదిక, పిరియాడిక్‌ సర్వేల పేరుతో వివరాలు తెలుసుకుని ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 4 లక్షల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని చెబుతూ ఈ తొలిగింపు ప్రక్రియకు ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశారుని,  ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డులను లింక్‌ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. .

నిబంధనలకు విరుద్దంగా టీడీపీ తన అధికారిక వెబ్‌సైట్లలో ఫొటోలతో కూడిన మొత్తం ఓటర్‌లిస్ట్‌ను ఉంచింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చే అధికారిక ఓటర్‌ జాబితాలో కూడా ఓటర్ల ఫొటోలు ఉండవు. కానీ టీడీపీ మాత్రం అనైతికంగా ఫొటోలతో సహా ఓటరు జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టి ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. 

 మరోవంక చంద్రబాబు నాయడు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 37 మందిలో సొంత సామాజిక వర్గానికి చెందిన 35 మందికి సీఐ నుంచి డీఎస్పీగా ప్రమోషన్లు ఇచ్చారని,  ఎప్పుడూ లేని విధంగా డీఐజీ లా అండ్‌ ఆర్డర్‌ పోస్ట్‌ క్రియేట్‌ చేసి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌ రావును నియమించారని తెలిపారు. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కీలక పోస్టుల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలన్నిటిని ఎన్నికల కమిషన్‌కు వివరించాం. 

చంద్రాబాబు నాలుగున్నరేళ్ల పాలనలో పో చేసిన రూ.4వేల కోట్లుకు పైగా డబ్బును ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చారని, ఆ డబ్బును పోలీసుల ద్వారానే పంచాలని చూస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు.ఈవీఎంలతో ఏదో జరిగిపోతుందని చంద్రబాబు ఇప్పుడు గగ్గోలు పెట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్లతో తమపై గెలిచాడని చెబుతూ అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపర్‌ జరిగాయా? అని ప్రశ్నించారు.