కాళ్లావేళ్లాపడి బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు

2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీతో పొత్తు కోసం బీజేపీ ఆరాటపడలేదని, చంద్రబాబు నాయుడు 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని తెలిసే కాళ్లావేళ్లాపడి మరీ పొత్తు కొసం వెంపర్లాడారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేక్వార్టర్స్‌ వద్ద బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన ప్రజాచైతన్య బస్సు యాత్రను ఆయన ప్రారంభిస్తూ ఈ విధంగా ప్రతి విషయంలో యూటర్న్  చంద్రబాబుకు అలవాటే అని ధ్వజమెత్తారు. 

వచ్చే ఎన్నికలలో తిరిగి బీజేపీ గెలవగానే మళ్ళి ఎన్డీయేలో చేరడానికి చంద్రబాబు ప్రాధేయ పడతారని జోస్యం చెప్పారు. అయితే ఎట్టి పరిస్థితులలో చంద్రబాబును ఎన్డీయేలో చేర్చుకొని ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.  తొలుత చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి గెలిచారని, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల కోసం పార్టీ పెడితే ఎన్నికలలో అధికారంలోకి రాగానే  ఆయన పంచన చేరారని గుర్తు చేశారు. తర్వాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆరోపించారు.

చంద్రబాబు గురించి నాకంటే ఎక్కువగా ఏపీ ప్రజలకే తెలుసు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారు. తెలంగాణలో ఓడిపోయాక ఫ్రంట్‌ అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుంది. 2019 ఎన్నికల తర్వాత.. మళ్లీ చంద్రబాబు ఎన్డీయేవైపు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. చంద్రబాబును ఎన్డీయే వైపు రానివ్వం.. తలుపులు మూసేస్తాం. రాష్ట్ర విభజన చట్టంలో 14 అంశాల్లో 10 అమలు చేశాం'' అని అమిత్‌ షా చెప్పారు.

  1998లో వాజ్‌పేయీ ప్రధాని కాగానే ప్రభుత్వ లబ్ధికోసం బిజెపితో చేతులు కలిపారని చెప్పారు. 2004లో బిజెపి అధికారం కోల్పోగానే కొత్తవారితో జతకట్టారని.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగాక ఏపీ ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌తో జతకలిశారని ఆయన ఆరోపించారు. అయితే తెలంగాణలో ఓటమి చెందగానే ఇప్పుడు మహాఘటబంధన్ వెంట పడుతున్నరని తెలిపారు. అధికారంలో లేని పదేళ్ల కాలంలో ఏ కూటమిలో చోటు దొరకక చంద్రబాబు ఉండిపోయారని గుర్తు చేశారు. 

తమ అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించామని చెబుతూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల్లో సింహభాగం మొదటి ఐదేళ్లలోనే పూర్తిచేశామని ప్రకటించారు. నాలుగేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ కు రూ 5.5 లక్షల కోట్ల మేరకు కేంద్రం నిధులు సమకూర్చినదని చెబుతూ ఈ విషయమై చంద్రబాబుతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు. 

తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌.. విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సంస్థలేవీ ఇంతకుముందు ఏపీలో  లేవని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌,  విశాఖలో ఎన్‌ఐపీఈఆర్‌ నెలకొల్పామని.. పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని కూడా ఏపీకి కేటాయించామని అమిత్‌షా వివరించారు.