2022 లోగా అంతరిక్షంలోకి ముగ్గురితో గగన్‌యాన్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఆగష్టు 15న ఎర్రకోట పై నుండి దేశ ప్రజలకు తెలిపిన విధంగా భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’లో భాగంగా ముగ్గురు మనుషులను 16 నిమిషాల్లోనే అంతరిక్షంలోకి 2022 లోగా పంపడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నది. ఇస్రో అత్యంత్ర ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత ఈ అంతరిక్ష ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చేపట్టనున్నామని అణుశక్తి, అంతరిక్షశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ కే శివన్ ప్రకటించారు.

ప్రయోగం చేపట్టిన 16 నిమిషాల్లో వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్తుందని చెప్పారు. వ్యోమగాములు భూమి నుంచి 300-400 కి.మీ. ఎత్తులో ఉండే దిగువ భూకక్ష్యలో ఐదు నుంచి ఏడురోజులు గడుపుతారని, ఆ తర్వాత వారు తిరిగి భూమి మీదకు వచ్చే మాడ్యూల్ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో దిగుతుందని తెలిపారు. 2004 నుంచే దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయని, అయితే అప్పట్లో అది తమ ప్రాధాన్యాంశంగా లేదని చెప్పారు.

ముగ్గురు వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌ను సర్వీస్ మాడ్యూల్‌తో జతపరుస్తారు. ఈ రెండూ మాడ్యూళ్లు ఆర్బిటల్ మాడ్యూల్‌లో భాగంగా ఉంటాయి. ఇది జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 రాకెట్‌లో అంతర్భాగంగా ఉంటుంది. వ్యోమగాములు ఐదు నుంచి ఏడురోజులపాటు అంతరిక్షంలో గడపుతారు. పలు సూక్ష్మ గురుత్వాకర్షణ, శాస్త్రీయ ప్రయోగాలను చేపడుతారు. తిరుగు ప్రయాణంలో ఆర్బిటార్ మాడ్యూల్ తనంతటతానుగా దిశను మార్చుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో డీ-బూస్ట్ (జ్వలన ప్రక్రియ) ప్రారంభమైన తర్వాత క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూళ్లు 120 కిలోమీటర్ల ఎత్తులో విడిపోతాయి. క్రూ మాడ్యూల్ తన వేగాన్ని తగ్గించుకోవడానికి అవసరమైన గాలి నియంత్రణ ప్రక్రియను కలిగి ఉంటుంది. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో దిగేముందు క్రూ మాడ్యూల్ పారాచూట్‌లు తెరుచుకుంటాయి. ఈ మొత్తం తిరుగు ప్రయాణానికి 36 నిమిషాల సమయం పడుతుంది. తిరుగు ప్రయాణంలో ఒకవేళ ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలో దించడానికి మరో ప్రణాళికను కూడా సిద్ధంగా ఉంచుతాం. ఇది అరేబియా సముద్రంలోనైనా లేదా బంగాళాఖాతంలోనైనా లేదా భూమిపైనైనా ఎక్కుడైనా ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నది. క్రూ

మాడ్యూల్ ల్యాండ్ అయిన తర్వాత 20 నిమిషాల వ్యవధిలో అందులోని వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకొస్తారు. ఏడు టన్నుల బరువుండే క్రూ మాడ్యూల్ 3.5 మీటర్ల వ్యాసం కలిగి చిన్న గది పరిమాణంలో ఉంటుంది. 2022లో మానవసహిత ప్రయోగానికి ముందు రెండు మానవరహిత పరీక్ష ప్రయోగాలను చేపట్టనున్నట్టు శివన్ తెలిపారు. 30 నెలల్లో మొదటి మానవరహిత పరీక్షా ప్రయోగాన్ని, 36 నెలల్లో రెండో మానవరహిత పరీక్షా ప్రయోగాన్ని, చివరగా 40 నెలల వ్యవధిలో మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపడుతామని వెల్లడించారు.

మానవసహిత ప్రయోగానికి వ్యోమగాములు బయటకువెళ్లే వ్యవస్థ లేదా ప్యాడ్ అబార్ట్ వంటి అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాల్సి ఉంటుందని, క్రూ మాడ్యూల్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, ప్రస్తుతం దానిపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వ్యోమగాముల శిక్షణ గురించి మాట్లాడుతూ.. వ్యోమగాములు ధరించే స్పేస్‌సూట్ సిద్ధమైందని చెప్పారు. వ్యోమగాములను శిక్షణ కోసం బెంగళూరుతోపాటు విదేశాలకు కూడా పంపుతామని చెప్పారు.

మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టిన ఇతర దేశాలతో పోల్చితే ఈ ప్రయోగానికి చేసే వ్యయం చాలా తక్కువని జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని పూర్తిస్థాయి దేశీయ పరిజ్ఞానంతో చేపడుతున్నాం. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ఎంపిక చేసిన తర్వాత వారిని శిక్షణ కోసం విదేశాలకు పంపుతాం. 2022 నాటికి అమెరికా, రష్యా, చైనా తర్వాత మానవసహిత అంతరిక్ష ప్రయోగం చేపట్టిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది అని ప్రకటించారు. ఈ ప్రయోగానికి రూ.10 వేల కోట్ల కంటే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పిన ఆయన.. ఈ తరహా ప్రాజెక్టు చేపట్టిన ఇతర దేశాల కంటే ఈ బడ్జెట్ చాలా తక్కువ అని స్పష్టంచేశారు. ఇస్రో వార్షిక బడ్జెట్ రూ. 6 వేల కోట్లకు ఇది అదనమని తెలిపారు.