సీఎం అయినప్పుడే అమ్మ ఎక్కువగా ఆనందించారు

‘నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ కంటే గుజరాత్‌కు ముఖ్యమంత్రిని అయినప్పుడే మా అమ్మ ఎక్కువగా సంతోషపడ్డారు’ అని ప్రధాని మోదీ చెప్పారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా.. గుజరాత్‌ సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు రోజు తన తల్లితో గడిపిన క్షణాలను మోదీ గుర్తుచేసుకున్నారు. అది ఆయన మాటల్లోనే..

‘మీరు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మీ అమ్మగారు ఎలా ఫీలయ్యారు? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. ప్రధానిగా నా పేరు బయటకొచ్చినప్పుడు దేశ వ్యాప్తంగా నా ఫొటోలను ప్రచురించారు. చాలా మంది ఆనందం వ్యక్తంచేశారు. కానీ నేను ప్రధాని అయినప్పటి కంటే గుజరాత్‌కు సీఎం అయినప్పుడే మా అమ్మ ఎక్కువగా ఆనందించారు.

గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను దిల్లీలో ఉండేవాణ్ణి. సీఎంగా పేరు ప్రకటించాక నేను అమ్మను కలిసేందుకు నేరుగా అహ్మదాబాద్‌ వెళ్లాను. అప్పటికే నేను ముఖ్యమంత్రిని అవుతున్నానన్న విషయం ఆమెకు తెలుసు. ఇంటికి వెళ్లేసరికి అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. నన్ను చూడగానే మా అమ్మ ఆనందంతో కౌగలించుకుని.. ‘నువ్వు మళ్లీ గుజరాత్‌కు వచ్చేశావు. అదే నాకు గొప్ప విషయం’ అని చెప్పారు. తల్లి మనసంటే అదేనేమో.. తన చుట్టూ ఏం జరుగుతున్నా సరే.. తన పిల్లలకు దగ్గరగా ఉండాలనే ప్రతి తల్లీ కోరుకుంటుంది.

ఆ తర్వాత మా అమ్మ నాకో మాట చెప్పారు. ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోనని నాకు మాటివ్వు. ఆ పాపాన్ని నువ్వు ఎన్నడూ చేయకు’ అని అన్నారు. ఆ మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. ప్రధాని అయిన తర్వాత కూడా నేను ఆ విలువలను పాటిస్తున్నాను.  ప్రధాని అయినా సీఎం అయినా దేశం పట్ల నిజాయతీగా ఉండాలనే అమ్మ ఆకాంక్షిస్తారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.