రుణమాఫీ కాంగ్రెస్ ఎన్నికల జిమ్మిక్


వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే తాపత్రయంతో ప్రజలను మోసం చేసేందుకు రైతు రుణమాఫీ స్కీంను ఒక గిమ్మిక్కుగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలపై విశ్వాసం లేదని, వారి ఓట్లు దండుకునేందుకు మాయమాటలు చెబుతోందని దుయ్యబట్టారు . తమ ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు సాలీనా రూ. 6వేలను మూడు విడతలుగా వారి ఖాతాలో నేరుగా జమ చేసే వినూత్న స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. 

ఐదు ఎకరాలున్న రైతులకు ప్రయోజనం కల్పిస్తామని చెబుతూ  రైతులకు రుణమాఫీ స్కీం వల్ల 80 శాతం రైతులకు మేలు జరగదని స్పష్టం చేశారు. వీరి సంగతిని ఎవరు పట్టించుకుంటారన్నారు. ఆదివారం ఆయన జమ్మూలో  వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ విజయ్‌పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడుతూ మతపరమైన అల్లర్లకు బలై ఇతర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదని విమర్శించారు. 

ఇరుగుపొరుగుదేశాల్లో మతపరమైన  దాడులను భరించలేక మనదేశానికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారు. కాశ్మీరీ పండిట్ల అంశం భావోద్వేగాలతో కూడుకున్నదని చెబుతూ శరణార్థులు గౌరవంగా జీవించే హక్కును కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామని భరోసా ఇచ్చారు. 

సరిహద్దుల్లో 14వేల బంకర్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తిలేదని, ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు. మాజీ సైనికులకు ఇచ్చిన హమీలను అమలు చేస్తున్నామని పేర్కొంటూ  ఈ విషయంలో కాంగ్రెస్ దగాకోరు విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ సైనికుల సంక్షేమానికి గత ప్రభుత్వం రూ. 500 కోట్లు ఖర్చుపెట్టగా కాని తమ ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన బకాయిలు, సంక్షేమం కోసం రూ.35వేల కోట్లను ఇంతవరుకు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. 

దేశ విభజన జరిగిన సమయంలోనే కర్తాపూర్‌లో గురునానక్ స్థాపించినన గురుద్వారా ప్రాంతం మన దేశంలో కలిపే విషయంలో ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ వహించలేదని విమర్శించారు.

 ప్రతి పౌరుడు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను తెరవాలన్న నిబంధన వల్ల ఈ రోజు రైతుల ఖాతాల్లోకి నేరుగా బెనిఫిట్ జమవుతుందని చెప్పారు. పీఎం కిసాన్ స్కీంకు రూ.75వేల కోట్లను మంజూరు చేశామని తెలిపారు. వచ్చే పదేళ్ల పాటు రైతులకు మేలు కలిగే విధంగా ఈ స్కీంకు సంబంధించి సొమ్మును డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరలో రైతులకు మొదటి వాయిదా కింద సొమ్మును డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించారు.