మేనిఫెస్టో కోసం ప్రజల వద్దకు బిజెపి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో తయారీ ప్రక్రియపైబీజేపీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, సీనియర్‌ నేత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆదివారం ‘భారత్‌ కే మన్‌కీ బాత్‌-మోదీ కే సాత్’‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలను ప్రజల ద్వారా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

నెల రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో దాదాపు పది కోట్ల మంది అభిప్రాయాలను సేకరించనున్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు.

 ‘‘ప్రజలు ఎలాంటి దేశాన్ని కోరుకుంటున్నారు. వారి ఆశల్ని చేరుకోవడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు. ఇలాంటి అంశాల్లో ప్రజల మనోభావాలను తెలుసుకుంటాం’’ అని అమిత్‌ షా తెలిపారు. దీంతో సరికొత్త భారత్‌ను ఆవిష్కరించే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల వద్దకు చేరే క్రమంలో దాదాపు 300 వాహనాలు, 7,700 బాక్స్‌లతో 4000 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టనున్నారు. అవసరమైతే అభిప్రాయ సేకరణలో సామాజిక మాధ్యమాలు, ఫోన్లను కూడా వినియోగించనున్నారు. 

ప్రజల తమ సలహాలను పేపర్‌పై రాసి వేయడానికి బాక్సులు ఏర్పాటు చేస్తామని, అలాగే, ఈ-మెయిల్‌, కాల్ సెంటర్ల ద్వారా కూడా వారి సలహాలను సేకరిస్తామని అమిత్‌ షా తెలిపారు. . ఒక్క నెలలో దేశంలోని తమ 11 కోట్ల కార్యకర్తలు 10 కోట్ల కుటుంబాలకు కలవాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు.  

దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. దేశంలో ఇప్పటి వరకు మేనిఫెస్టో తయారీ కోసం ఇటువంటి కార్యక్రమం జరగలేదని తెలిపారు. ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పలు కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. 20 మంది సభ్యులున్న ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహిస్తున్నారు.