ఉపాధ్యాయుల ఏకీకృత ఆదేశాలు కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరోసారి చుక్కెదురయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్‌, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్‌ నిబంధనలను వర్తింప జేస్తూ ప్రభుత్వం 2017లో తెచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఉపాధ్యాయుల ఏకీకృత నిబంధనలను సవాల్‌ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బదిలీలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని, ఉపాధ్యాయులందరికీ ఒకే సర్వీస్‌ నిబంధనలు అమలు చేయాలని పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు చాలా కాలంగా ఆందళన చేస్తున్నారు. వారి డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఉపాధ్యాయులందరినీ ఒకే సర్వీస్‌ నిబంధనల కిందకు తెస్తూ గతేడాది జూన్‌ 23న రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చింది.

ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఉపాధ్యాయుల నియామకం సమయంలోనే పంచాయతీరాజ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేర్వేరు నిబంధనలు ఉంటాయని, లక్షల సంఖ్యలో ఉండే పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులను తమతో కలపటం ద్వారా తమ ప్రయోజనాలను దెబ్బతింటాయని ప్రభుత్వ ఉపాధ్యాయులు హైకోర్టుకు విన్నవించారు. ఇరు వార్గాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఇవాళ ఏకీకృత సర్వీస్‌ నిబంధనలను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పంచాయతీరాజ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయులకు వారి వారి నిబందనల మేరకే జరగనున్నాయి.