కశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కరానికి ప్రధాని భరోసా

కశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కరానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన జమ్మూ-కశ్మీరులోని లేహ్‌, విజయ్‌పూర్‌లలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విజయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను చాలా కీలకమైన అంశంపై మాట్లాడబోతున్నానని చెప్పారు.

అది కశ్మీరు పండిట్లకు సంబంధించిన విషయమని అంటూ కేంద్ర ప్రభుత్వం కర్తవ్యబద్ధతతో కశ్మీరీ పండిట్ల ఆత్మాభిమానం, గౌరవం, హక్కుల అమలుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. హింస, ఉగ్రవాదం చెలరేగిన కాలంలో కశ్మీరీ పండిట్లు తమ స్వంత ఇళ్ళను వదిలిపెట్టి బయటికి పారిపోవలసి వచ్చిందని, ఇది భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఈ రోజు నా చేతుల మీదుగా కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తాను’ అంటూ మోదీ హామీ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. అలాంటి పాడుబడ్డ సంస్కృతికి తమ ప్రభుత్వంలో చరమగీతం పాడిందని స్పష్టం చేశారు.

బిజెపి పాలనలో అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, విభజన రాజకీయాలను ఈ అయిదేళ్ల పాలనలో దేశం నుంచి తరిమికొట్టామని పేర్కొన్నారు.  2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం (కాంగ్రెస్)కు ప్రజల భావోద్వేగాలు, సదుపాయాల పట్ల ఆసక్తి ఉండెడిది కాదని అంటూ ఏమాత్రం గత పాలకులు శ్రద్ద చూపినా కర్తర్పూర్ గురుద్వారా ఎప్పుడో భారత్ లో భాగం అయి ఉండేదని చెప్పారు. రైతు రుణాల రద్దు విషయంలో కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేసినదాని మండిపడుతూ 2008-09 ఎన్నికలలో రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రూ 52,000 రుణాలను మాత్రమే రద్దు చేసి చేతులు దులుపుకున్నదని ధ్వజమెత్తారు. వాస్తవానికి అప్పట్లో రైతులు చెల్లించవలసిన రుణాలు రూ 6 లక్షల కోట్ల మేరకు ఉన్నాయని చెప్పారు.

పైగా తదుపరి కాగ్ నివేదికలలో అర్హత లేని 30 నుండి 35 లక్షల మంది రుణాలు రద్దయిన్నట్లు తేలినదని చెబుతూ ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళినది ప్రశ్నించారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇప్పుడు రైతు రుణాలు రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్నదని అంటూ మధ్య ప్రదేశ్ లో అధికారమలోకి వచ్చి ఏమి చేస్తున్నారో చూడామని కోరారు. కొందరు రైతులకు రుణాల రద్దు క్రింద రూ 13 చెక్ లు వచ్చాయని, రుణాలే లేని మరికొందరు రైతులకు కూడా చెక్ లు వచ్చాయని దుయ్యబట్టారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి మాట్లాడుతూ ఈ పథకం ప్రయోజనాలు అందరు రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా చేరుతాయని భరోసా ఇచ్చారు. దీని కోసం రూ.75 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కల రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆదాయ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ పథకాన్ని ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించిన బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని మోదీ తెలిపారు. మొదటి విడత సాయంగా అయిదు ఎకరాల్లోపు రైతుందరికీ రూ.2వేల సాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పథకం అమలు కోసం అర్హుల పేర్లు, ఆధార్‌ నెంబర్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శాకాలు జారీ చేశామని, వీలయినంత త్వరలో వారికి ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నుంచి సాయం అందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో నివసిస్తున్న తీరు తనకు మరింత శ్రమించడానికి స్ఫూర్తినిస్తోందని చెప్పారు. లడఖ్ స్వయంప్రతిపత్తి కొండ అభివృద్ధి మండలి చట్టానికి సవరణలు చేశామని, దీంతో కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులను ఈ కౌన్సిల్ విడుదల చేస్తుందని తెలిపారు.లేహ్‌లో కుషోక్ బకుల రింపోచీ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. దీనిలో అత్యాధునిక వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.