పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయని, ఆమె గద్దె దిగవలసిన రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆమె ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. బాలూర్ ఘాట్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి టెలిఫోన్ ద్వారా ఆయన మాట్లాడుతూ మమతా ప్రజలకు వ్యహాతిరేకం, ప్రజాస్వామినికి వ్యతిరేకం, జాతీయ భద్రత విషయంలో రాజీ పడుతున్నారని విమర్శలు కురిపించారు.
ప్రజాస్వామ్యంలో పరిపాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయరాదని మమత బెనర్జీ తప్పనిసరిగా అంగీకరించాలని స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం పని చేస్తున్న తీరు ఎవరికీ ఆమోద యోగ్యం కాదని దుయ్యబట్టారు. జనవరి 19న కలకత్తాలో మమతా ఏర్పాటు చేసిన ర్యాలీకి హాజరైన ప్రతిపక్ష నేతలు అందరు ఆమె అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను గమనించాలని యోగి విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దీనాజ్‌పూర్, దక్షిణ దీనాజ్పూర్లలో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో ఆదిత్యనాథ్ ప్రసంగించవలసి ఉంది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా బాలూర్ ఘాట్‌లో దిగేందుకు అనుమతిని జిల్లా యంత్రాంగం నిరాకరించింది. దీంతో ఆయన టెలిఫోన్ ద్వారా ఈ సభలకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
తనను ప్రజలతో మాట్లాడకుండా ఈ విధంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. తాను గద్దె దిగవలసి వస్తుందనే ఆమె బీజేపీ అంటే భయపడుతున్నదని, బీజేపీ నేతల బహిరంగ సభలకు అడ్డుపడుతున్నారని యోగి మండిపడ్డారు.
గతంలో సంతృప్తికర రాజకీయాలకోసం రాష్ట్రంలో దుర్గ పూజను అడ్డుకోవాలని మమతా ప్రభుత్వం ప్రయత్నం చేసినదని ఆరోపిస్తూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం బిజెపి కార్యకర్తలు పోరాడాలని పిలుపిచ్చారు.
కాగా, బలూర్‌ఘట్ ఎయిర్‌పోర్ట్‌లో యోగి చాపర్‌కు అనుమతి నిరాకరించినందుకు నిరసనగా దినాజ్పూర్లో జిల్లా మేజిస్ర్టేట్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. యోగి విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరణపై జిల్లా మేజిస్ర్టేట్ సరైన వివరణ ఇవ్వలేకపోయారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సైతం అధికారులు తొలుత అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.