పట్టాలు తప్పిన సీమాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ .. ఏడుగురి మృతి

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సీమాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు హజీపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందారు. పలువురికి గాయలపాలైనట్లు సమాచారం. ఎస్8, ఎస్‌9, ఎస్‌10, బీ3(ఏసీ), ఒక జనరల్‌ బోగీ సహా మొత్తం తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి.

బాధితుల సహాయార్థం ఆయా ప్రాంతాల్లో రైల్వేశాఖ హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో  రైలు పట్టాలు తప్పాయి. 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి . రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ...

‘‘సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. బాధితులకు రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సహా స్థానిక అధికారులు సాధ్యమైనంత సాయం అందిస్తున్నారు...’’ అని పేర్కొన్నారు. 

కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడినవారికి రూ.50 వేల సాయం అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రైల్వే శాఖ సైతం మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్షల, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు సాయం అందించనున్నట్టు వెల్లడించింది.