గుజరాత్ కాంగ్రెస్ కు షాక్ ... నాలుగురు ఎమ్యెల్యేల జంప్ !

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వరాష్త్రమైన గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన షాక్ కు గురైనది. పార్టీ ఉంఝా శాసనసభ్యురాలు డా. ఆషా పటేల్ పార్టీకి, శాసనసభ్యత్వానికి శనివారం రాజీనామా చేయడంతో పార్టీ నాయకత్వం ఖంగు తిన్నది. ఆమె దారిలో మరో ముగ్గురు కనీసం పార్టీకి రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. వీరంతా బీజేపీలో చేరే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ నాయకత్వంపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని ఆమె రాజీనామ వెల్లడించింది. ఆమె అసెంబ్లీ స్పీకర్ కు కూడా తన రాజీనామాను సమర్పించింది. ఉన్నత విద్యావంతురాలైన డా. ఆశా పటేల్ పటిదార్ ఉద్యమ నేత  హార్దిక్ పటేల్ మద్దతుదారు కూడా. అసెంబ్లీలో ఆమె ఎక్కువగా మహిళా విద్య, మహాలయా సాధికారికతలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ  వస్తున్నారు. 

ఆమె ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వ్రాసిన లేఖలో ఆయన నాయకత్వం పలు రంగాలలో విఫలం చెందుతున్నట్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో తాను పలు అవమానాలను ఎదుర్కొంటున్నట్లు తెలుపుతూ తాను లేవనెత్తిన ప్రజా సమస్యలను పార్టీ పట్టించుకోవడంలేదని, పార్టీలో ఊపిరి ఆడని విధంగా భావిస్తున్నానని చెప్పారు. 

రాహుల్ గాంధీ మంచివారే కావచ్చు, కానీ ఆయన, ఇతరులు ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోలేక పోతున్నారు. పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సామాన్వ్యయం లేదు అంటూ ఆమె పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి నాయకులు ఎప్పుడు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. మరోవంక జనరల్ కేటగిరిలో పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీని ఆమె ప్రశంశలతో ముంచెత్తారు. 

ఇలా ఉండగా, మరొకొందరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కూడా ముఖ్యమంత్రి విజయ్ రూపానితో సమావేశమైన్నట్లు తెలుస్తున్నది. వారిలో గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన నేత,  రాధంపూర్ ఎమ్యెల్యే అల్పేష్ ఠాకూర్ కూడా ఉన్నారు.  బయడ్ దావ్లసిన్హ జల, బచ్రాజ్ భారతి ఠాకూర్, పఠాన్ కిరి పటేల్, చోటిలా రూజ్విజ్ మక్వాన, సవరకుణ్డల ప్రతాప్ దుధర్, చిరాగ్ కాలారియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు తమకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ప్రకటనలు చేశారు. 

తమ ఎమ్యెల్యేలు చేజారిపోతున్నట్లు ఆందోళన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావదా ప్రకటనలో స్పష్టంగా వ్యక్తం అవుతున్నది. బీజేపీ తమ ఎమ్యెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, బెదిరించో లోబరచుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు అక్కసు వెళ్లగక్కారు. 

డా. ఆషా పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహార సరళిని ప్రశ్నించడంతో కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు సక్రమంగా లేన్నట్లు స్పష్టం అవుతున్నట్లు ముఖ్యమంత్రి రూపాని చెప్పారు. 

గుజరాత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు తమతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. బీజేపీలో చేరడం ద్వారా తమ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన కృషి చేయాలని కోరుకొంటున్నరని అంటూ సమాజం కోసం తమ దగ్గరకు వచ్చే వారికి స్వాగతం పలుకుతూనే ఉంటామని తెలిపారు.