చంద్రబాబు విధానాలతో నవ్వులపాలవుతున్న ఏపీ

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధానాలు, దుబారాల వల్లే  ఎపి దేశవ్యాప్తంగా నవ్వులపాలవుతోందని ఎమ్మెల్సీ, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఈమధ్య మతిస్థిమితం తప్పినట్లు కనిపిస్తోందని, ఆయనలో ఏదో కీలకమైన చక్రం పనిచేయడం లేదని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతూ అందర్నీ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 

చంద్రబాబు, ఆయన కుమారుడు చినబాబు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడుతూ, రాష్ట్రానికి వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని చెప్పడం వారి  ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. కేంద్రం అమలు చేస్తున్న 54 పథకాల్లోనే రాష్ట్రానికి 641 అవార్డులు లభించాయని సోము వీర్రాజు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీని తీసుకోకపోవడం వెనుక ఆయన స్వార్థం ఉందని, ఆయనకు ప్రాజెక్టుల్లో సొంత ప్యాకేజీల కోసం నిధులు కావాలని అందుకే తమపై దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు పాలనలో దుబారా వ్యయం, అవినీతిని అరికడితే రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణ ప్రారంభోత్సవానికి రూ. 400 కోట్లు ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన విధానాలు చూస్తే రాష్ట్రానికి ఎవరు భారమో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కనీసం ప్రహారీగోడలు నిర్మించకుండా నిట్ వంటి కేంద్ర సంస్థల నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని సోము ప్రశ్నించారు. 

చంద్రబాబునాయుడు తన హెరిటేజ్ నిధులు వెచ్చిస్తున్నారా లేక సొంత భూములు కేటాయిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో తెలుగువిశ్వవిద్యాలయం దుస్థితి చూస్తే ఆవేదన కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి ఊడిగం చేస్తున్నారని తమను విమర్శిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి ఊడిగం చేస్తున్నారా అని నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో సోనియాగాంధీని దెయ్యంతో పోల్చిన ఆయనకు ఇప్పుడు ఆమె దేవతగా మారిందా అని ఎద్దేవా చేశారు. 

మోదీ ప్రకటించిన ఈబీసీ కోటాలో 5శాతం కాపులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో ఈబీసీ కోటా ఇస్తామని ప్రకటించారని, అది ఏమైందని సోము నిలదీశారు. చంద్రబాబునాయుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ఎద్దేవా చేస్తూ గత ఎన్నికల్లో ఆయన ఇదే ఈవీఎంలతో నెగ్గారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఈవీఎం మిషన్లతోనే నెగ్గిందని గుర్తుచేశారు. 

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని వీర్రాజు గుర్తు చేశారు. రైతులు, మధ్యతరగతి, ప్రైవేటు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఈబడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. రక్షణ రంగానికి ప్రాధాన్యతనిస్తూ రూ. 3లక్షల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశమే పరిసర దేశాలకు రూ. 98వేల కోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేస్తోందని చెప్పారు. 

ప్రధాని నరేంద్రమోదీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ దేశాభివృద్ధికి దోహదపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 50లక్షల మంది ఉద్యోగులు, 40 లక్ష ల మంది రైతులకు ఈబడ్జెట్ ద్వారా లబ్ది చేకూరుతుందని వివరించారు. 

సోము వీర్రాజు చైర్మన్‌గా బీజేపీ ఎన్నికల కమిటీ

రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ కమిటీని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా ఎమ్మె ల్సీ సోము వీర్రాజు, సభ్యులుగా ఎంపీ జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, షేక్ మస్తాన్, షేక్ బాజీ, ఆర్‌డీ విల్సన్, అడపా శివనాగేంద్రరావు, వాసిరెడ్డి వెంకట చైతన్య, సాంబశివరావు, రఘునాథబాబు నియమితులయ్యారు.