రామాలయంపై రాహుల్ వైఖరి స్పష్టం చేస్తారా !

అయోధ్యలో రామాలయం నిర్మించే విషయమై తమ వైఖరిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేయగలరా అని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సవాల్ చేశారు. డెహ్రాడూన్ లో బిజెపి పార్టీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించడం ద్వారా ఉత్తరాఖండ్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.

 ‘రామమందిరంపై బీజేపీ వైఖరి ఎల్లవేళలా స్పష్టంగా ఉంది. అయోధ్యలో రామమందిరాన్ని త్వరగా నిర్మించి తీరాల్సిందేనని నేను ఈ రోజు ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ అంశంపై రాహుల్ గాంధీ కూడా ఆయన వైఖరిని స్పష్టం చేయగలరా?’ అని అమిత్ షా పేర్కొన్నారు.  పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అని నినదిస్తుండగా ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

అయోధ్యలో రామమందిరాన్ని త్వరగా నిర్మించి తీరాల్సిందేనని స్పష్టం చేస్తూ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ‘కుంభ్ మేళా జరుగుతోంది. అందువల్ల రామమందిరాన్ని నిర్మించాలనే డిమాండ్ రావడం సహజం’ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో తన న్యాయవాదుల ద్వారా రామమందిర నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. 

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో విచారణను లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాయిదా వేయాలని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ 2017లో దాఖలు చేసిన పిటిషన్‌ను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి దేశంలోనే అత్యంత పాతదయిన స్థల వివాదం కేసులో విచారణను వాయిదా వేయాలని ఎందుకు కోరిందో చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అయితే, కపిల్ సిబల్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం చుట్టూ ఉన్న భూమిని దాని స్వంత యజమానులకు తిరిగి ఇచ్చివేయడానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఇటీవల కుంభ్ మేళాలో సమావేశమయిన హిందూత్వ శక్తులు, సాధువుల నుంచి రామమందిర నిర్మాణంపై డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

 కాగా, మరి కొన్ని నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనుండగా మహాకూటమిని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. పరస్పరం భిన్న వైఖరులు కలిగిన ప్రతిపక్షాలు మోదీని ఒంటరిగా ఎదుర్కోవడానికి కనీసం ఆలోచించే ధైర్యం కూడా లేని పరిస్థితుల్లో నిరాశా నిస్పృహలతో మహాకూటమిగా ఏర్పాటు కావడానికి ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా విమర్శించారు.