ఓడినా చరిత్ర సృష్టించిన సింధు

 భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి ఫైనల్‌ను అధిగమించలేకపోయింది. దీంతో ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో రెండు వరుస గేమ్‌ల్లో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అయినా చరిత్ర సృష్టించింది.

బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచింది. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్‌లోనే ఓడి బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. 1982 తర్వాత సింగిల్స్‌లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి.

ఫైనల్స్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉంది. తొలి గేమ్‌ 0-5తో వెనుకంజలో ఉన్న సింధు ఆ తర్వాత కాస్త పోరాడింది. కానీ, కోర్టులో అత్యంత వేగంగా కదిలే తైజు కదలికలను సింధు అర్థం చేసుకోలేకపోయింది.

డ్రాప్‌ షాట్లు, స్మాష్లు ఆడుతూ తైజు సింధును ఒత్తిడికి గురి చేసింది. దీంతో సింధు 13-21తో తొలి సెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండో గేమ్‌ను బాగానే ఆరంభించిన సింధు అదే జోరును కొనసాగించలేకపోయింది. దీంతో రెండో గేమ్‌ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి కావడం విశేషం.