మోదీ పోస్టర్లపై మమత ఫొటోలు.. బిజెపి మండిపాటు

పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో నేడు (శనివారం) బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీకి పూర్తిస్థాయి ఏర్పాటు చేసిన బీజేపీ ఎక్కడికక్కడ పోస్టర్లు ఏర్పాటు చేసింది. అయితే, బీజేపీ ఏర్పాటు చేసిన మోదీ పోస్టర్లపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోస్టర్లు దర్శనమివ్వడంతో బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దుర్గాపూర్ లో మోదీ ప్రసంగించే సభాస్థలికి కేవలం 50 నుండి 70 మీటర్ల లోపే మోదీ పోస్టర్లు, బ్యానర్లపై మమతా బెనర్జీ పోస్టర్లు, బ్యానర్లు ఉంచారు. ఈ విషయమై బిజెపి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ పనికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. బీజేపీ ఏర్పాటు చేసిన హోర్డింగులు, బ్యానర్లను టీఎంసీ కార్యకర్తలు లాగి పడేశారని, స్వాగత ద్వారాలను కూడా కూల్చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ దౌర్జన్యంపై నిరసన వ్యక్తం చేసిన ఓ బీజేపీ కార్యకర్తపై టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని సిన్హా పేర్కొన్నారు.

కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కూడా టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై ఆ పార్టీ మద్దతుదారులు దాడి చేశారని, ప్రధాని మోదీ పోస్టర్లను చింపి పడేశారని ఆరోపించారు. వాటి స్థానంలో మమత బెనర్జీ ఫొటోలు, బ్యానర్లు పెట్టారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ఆటవిక పాలన సాగుతోందని తీవ్రస్థాయిలో ఆమె  మండిపడ్డారు.