బిజెపి ప్రజాదరణతో మమతకు వణుకు : మోడీ

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి రోజురోజుకు పెరుగుతున్న జనాదరణ చూసి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వణుకు పుడుతోందనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అందుకే ఆమె తమ పార్టీ కార్యకర్తలపై వేధింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌ కంచుకోట పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కష్టాల్లో ఉన్న రైతులను రుణమాఫీతో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు కురిపించారు.

మాత్వా షెడ్యూలు కులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో భారీగా తరలివచ్చిన ప్రజలను అద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పుడు అర్థమైంది. మమత, ఆమె పార్టీ కార్యకర్తలు ఎందుకు అమాయక ప్రజలను చంపుతూ హింసకు పాల్పడుతున్నారో. ఎందుకంటే మీ ప్రేమ మా వైపుంది కాబట్టి’ అని వ్యాఖ్యానించారు.  

కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుకు మమతా బెనర్జీ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్ వచ్చే వారం రాజ్యసభ ముందుకు రానున్నది. రాజ్యసభలో బిల్ ఆమోదం పొందలేని పక్షంలో లోక్ సభ ఎన్నికలు వస్తుండడంతో ఈ బిల్ మురిగిపోయే అవకాశం ఉంది. 

మత ఘర్షణల కారణంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పారిపోయి వచ్చిన ముస్లిమేతర  మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు గురించి మాట్లాడుతూ.. ‘పొరుగు దేశాల్లో ఉంటున్న హిందవులు, సిక్కులు, పార్శీలు, క్రైస్తవులు అక్కడ ఎన్నో బాధలు అనుభవించారు. ఎక్కడకు వెళ్లాలో తెలియక భారత్‌కు వచ్చారు. అలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు పౌరసత్వ బిల్లును తీసుకొచ్చాం. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు మద్దతివ్వండి. ఇక్కడున్న నా సోదరసోదరీమణులకు(పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులను ఉద్దేశించి) ఈ బిల్లు ఎంతో అవసరం’ అని ప్రధాని మోదీ తృణమూల్‌ పార్టీని కోరారు.  

 ఇలా ఉండగా, లోక్ సభ ఎన్నికలలో తనను ఓటించడం కోసం ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడే ప్రయత్నాన్ని ప్రధాని ఎద్దేవా చేశారు. తనకు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండడంతో వల్లననే వారంతా భయానికి గురవుతున్నరని చెప్పారు. "ఉన్నత స్థానాలలో ఉన్న బలవంతుల అక్రమాలకు ఈ ఛాయివాల అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో చౌకీదార్ ను తొలగించాలని కలకత్తాలో సమావేశమైన పక్షాల నాయకులు ప్రతిన బూనారని ఎద్దేవా చేశారు. 

కాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనదనీ.. రైతులు, కార్మికులు, మధ్యతరగతి వర్గాలు సహా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని ప్రధాని చెప్పారు. 

దశాబ్దాలు గడచినా, గత ప్రభుత్వాల చేతిలో శ్రామిక, మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌తో తాము ప్రకటించిన కేటాయింపులు 12కోట్ల మంది సన్నకారు రైతులకు లాభం చేకూర్చనుందని ఆకాంక్షించారు. 30నుంచి 40కోట్ల మంది శ్రామికులకు, మూడు కోట్ల మధ్య తరగతి ప్రజలకు ప్రస్తుత కేటాయింపులతో లబ్ధి పొందనున్నారని వివరించారు.  

సభలో తోపులాట... ప్రధాని క్షమాపణ 

నార్త్ 24 పరగణాస్‌లో ఇవాళ బీజేపీ నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్దఎత్తున తోపులాట చోటుచేసుకుంది. కారణంగా మహిళలు, చిన్నపిల్లలు సహా అనేక మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ పట్టుమని పావుగంటలోనే తన ప్రసంగాన్ని కుదించుకోవాల్సి వచ్చింది. 

మతువా వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తుండగా... వేదిక వెలుపల ఉన్న వందలాది మంది కార్యకర్తలు సభలో స్త్రీలకు కేటాయించిన ఇన్నర్ రింగ్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా తోపులాట మొదలయ్యింది.  

అందరూ తమతమ స్థానాల్లో కూర్చోవాలనీ... వేదిక ముందుకు రావద్దంటూ మోదీ వారించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. తోపులాట కారణంగా గాయపడిన మహిళలు, పిల్లలకు స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు. 

పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి ఆ ప్రాంతంలో పోలీసులు అనేవారు లేకపోవడంతో ఈ తోపులాట జరిగినదని బీజేపీకి నేతలు విమర్శించారు. తదుపరి దుర్గాపూర్ లో జరిగిన బహిరంగసభలో  మాట్లాడుతూ ఠాకూర్ నగర్ సభలో తొక్కిసలాట  జరగడం పట్ల ప్రధాని విచారం వ్యక్తంచేశారు. ప్రజలకు క్షమాపణ తెలిపారు. ఈ సభాస్థలంలో సామర్ధంకన్నా రెట్టింపు మంది ప్రజలు రావడంతోనే ఈ విధంగా జరిగిన్నట్లు పేర్కొన్నారు.