నిమిషానికో రంగు... మాట మార్చే బాబు

నిమిషానికో రంగు... నిమిషానికో మాట మార్చేతత్వం తెలుగుదేశం పార్టీది...ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని శాసనసభ సమావేశాల్లో  ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు’పై జరిగిన చర్చలో పాల్గొంటూ  భారతీయ జనతా పార్టీ ఫ్లోర్‌లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యితిరేకంగా దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే నేడు చంద్రబాబు అదే పార్టీతో చేతులు కలపటమేగాక, శుభప్రదమైన పసుపురంగును పక్కనబెట్టి తనతోపాటు తన వారితో కూడా నల్ల దుస్తులను ధరింపచేసారంటూ ఎద్దేవా చేశారు. 

అయితే ఈ రాష్ట్భ్రావృద్ధికి దేశంలో ఏ రాష్ట్రానికీ చేయని విధంగా ప్రధాని మోదీ చేయూతనిస్తుండటం వల్లనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నల్ల దుస్తులు ధరించలేదతెలిపారు. శాసన సభాపతి ముగ్గురి రాజీనామాలను ఆమోదించారు... 23 మంది ఫిరాయంపు ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో అంతుబట్టటంలేదని నిలదీశారు. 

అయితే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తున్నంత సేపు టీడీపీ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ అడుగడుగునా అవరోధం కల్పిస్తూనే వచ్చారు. మధ్యలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీజేపీ సభ్యుడు ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశారో ముందు చెప్పాలని నిలదీశారు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నదనే ఆయన రాజీనామా చేశారని చెబుతుండగా విష్ణుకుమార్ రాజు కల్పించుకుంటూ టీడీపీ సభ్యులు మేడా మల్లిఖార్జునరావు, రావెల కిషోర్‌బాబు ఎందుకు రాజీనామా చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 

రాష్ట్ర విభజన తప్పిదాన్ని తమపై మోపవద్దంటూ, ఆనాడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అంటూనే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారుకదా అని ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు’ అంటూ ఇదే సభలో ప్రధాని మోదీని పొగుడుతూ తీర్మానం చేసిన చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హోదా పేరిట జగన్ ప్రజల్లోకి దూసుకువెళుతుండటమే దీనికి కారణమని తెలిపారు. 

అసలు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలలో బాబు వెంట మున్ముందు ఎంత మంది నిలుస్తారో చూడాల్సి ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల్లో బాబు కారణంగా కాంగ్రెస్సే కాదు, తాము కూడా నిండా మునిగిపోయామని దుయ్యబట్టారు. టీడీపీతో చెలిమే దీనికి కారణమని స్పష్టం చేశారు. ముందుగా విశాఖ రైల్వేజోన్ గురించి మాట్లాడాలంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరి కొందరు పదేపదే వ్రశ్నించగా తప్పక వస్తుందని విష్ణుకుమార్‌రాజు భరోసా వ్యక్తం చేశారు. 

ప్రత్యేక ప్యాకేజీ కింద వివిధ పద్దుల కింద రూ. 15వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైనా బాబు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే తిరస్కరించారని రాజు మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ దాదాపు కేంద్రం నెరవేర్చిందని, పైగా సంబంధంలేని ప్రాజెక్టులను కూడా మంజూరు చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని పేర్కొన్నారు.