చంద్రబాబు అవినీతి చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అవినీతి చూస్తుంటే ప్రజల రక్తం ఉడికిపోతోందని, మనిషిగా ఉండే అర్హతను ఆయన ఎప్పుడో కోల్పోయారని ధ్వజమెత్తుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్‌ చేశారు. బీజేపీ నేతలపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు.  

‘మీకు సిగ్గుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను మీవిగా దొంగ ప్రచారం చేసుకోరు. రాష్ట్ర కోసం మీరేదో హెరిటేజ్‌ డబ్బులు పెడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు భాషను సరిచేసుకోని క్షమాపణలు చెప్పాలి. మనిషిగా ఉండే అర్హతను మీరు ఎప్పుడో కోల్పోయారు. నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్ర ఇచ్చిన లక్షల కోట్ల నిధులను దోచేసి ఇప్పుడు మమ్మల్నే తిడతావా?. రాష్ట్ర సంపదను రసం పీల్చే పురుగులా తినేస్తు.. లెక్కలు అడిగితే యూటర్న్‌ తీసుకుని మాపై నిందలు వేస్తావా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, సీఎం  చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని నిలదీశారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గల నియోజకవర్గాలకు నిధులు నిలుపుదల చేస్తోందని మండిపడ్డారు. దేశంలో రాష్ట్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. చందబ్రాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతుంటే తాము చాలా బాధపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదని, నిజమైన రోషమని మాణిక్యాలరావు పేర్కొన్నారు.