ఇది ట్రైలర్‌ మాత్రమే : ప్రధాని మోదీ

కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కేవలం ట్రయిలరేనని, ఎన్నికల తర్వాత భారత్‌ను అభివృద్ధి పథంలోకి పయనింపజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2019-20 సంవత్సరానికి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని స్పందిస్తూ, మధ్యతరగతి వర్గం నుంచి కార్మికుల వరకూ, రైతుల అభివృద్ధి నుంచి వ్యాపారుల అభివృద్ధి వరకూ, ఉత్పత్తి రంగం నుంచి ఎంఎస్ఎంఈ రంగం వరకూ, ఆర్థిక వృద్ధి నుంచి న్యూ ఇండియా అభివృద్ధి వరకూ, అందర్నీ దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని చెప్పారు. 

మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందని పేర్కొంటూ తమకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న వారి అభిమతాన్ని నెరవేర్చామని, రూ.5 లక్షల రూపాయల వరకూ ఆదాయం పన్ను నించి మినహాయింపు ఇచ్చామని చెప్పారు. ఎప్పటికప్పుడు వివిధ ప్రభుత్వాలు రైతుల కోసం పలు పథకాలు ప్రవేశపెడుతూ వచ్చినప్పటికీ 2 నుంచి 3 కోట్ల మంది రైతులే ఆ స్కీముల పరిధిలోకి వచ్చారని, అయితే ఇప్పుడు 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం' కింద సొంతంగా 5 ఎకరాలు, అంతకంటే తక్కువ భూమి ఉన్న 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని చెప్పారు.

వృద్ధికి అనుకూలంగా, రైతులు, పేదలకు ప్రయోజనకారిగా ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కొనియాడారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని బలోపేతం చేస్తుందని చెప్పారు. 2014-19 వరకు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లు అన్నీ మధ్య తరగతి వర్గానికి ఎన్నో రకాలుగా వెలుసుబాట్లను కల్పించాయని పేర్కొన్నారు. 

ఇదొక చరిత్రాత్మక బడ్జెట్ అని, అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారని హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ పేర్కొన్నారు. 

ఈ మధ్యంతర బడ్జెట్‌ రైతులు, మధ్యతరగతి, పేదలు, మహిళలు అన్ని వర్గాల వారికి ప్రయోజనకరంగా ఉందాని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసయింసించారు. ‘న్యూ ఇండియా’ సాకారానికి ఇది సహకరిస్తుందని చెప్పారు.

 ఇది ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్,  ప్రజల అభివృద్ధి, శ్రేయస్సును ఉద్దేశించిన బడ్జెట్ అని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. న్యూ ఇండియా 2022 సాకారానికి ఇది సహకరిస్తుందని చెప్పారు.