అలీబాబా క్లౌడ్ తో ఈడీబీ ఒప్పందం

అంకుర సంస్థల ప్రోత్సాహం, చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అలీబాబా సంస్థ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ లో వినియోగించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవెలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్, అలీబాబా క్లౌడ్ ఇండియా ఎండీ డాక్టర్ అలెక్స్ లీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

స్మార్ట్ సిటీల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ లో తమకున్న అనుభవాన్ని మరింత పదును పట్టి, ఆంధ్రప్రదేశ్ లో వినూత్న ఆవిష్కరణలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు అలీబాబా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి కి వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో సాంకేతికతను జోడించి మరింత సులభతరమైన విధానాలు అమలయ్యేలా శిక్షణ కార్యక్రమాలు ఆ సంస్థ చేపట్టనుంది. ఈ వ్యవస్థలో భాగస్వామ్యులైన ప్రభుత్వ శాఖలతో అవగాహన సదస్సు లో పాల్గొన్న ఆ సంస్థ తమ అధికారులను కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి పంపనున్నారు. అలీబాబా సంస్థ తమ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ లో మరింత విస్తరించనుంది.

ప్రపంచంలో ఎటువంటి సృజనాత్మకమైన విధానం అందుబాటులోకి వచ్చినా, అది ఆంధ్రప్రదేశ్ కు కూడా ఉపయోగపడేలా తాము దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకానొకప్పుడు పాలనా వ్యవహారాల్లో ఇంటర్నెట్ అంటే తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా ఈ ప్రయోగాలు చేసి ప్రజలకు పాలనను మరింత సౌలభ్యంగా ఉండేలా చేశామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి జరగాలంటే తగు వాతావరణం ఏర్పాటు చేయాలి, ఆధునిక సాంకేతికతను జోడించి భవిష్యత్ కి చక్కటి బాటను వేయాలన్నదే తమ ఆలోచన విధానమని ఆయన చెప్పారు.

"ఆధార్ లాగే భూధార్ తెచ్చాం.. భూములన్నిటి సమగ్ర సమాచారాన్ని పొందుపరచగలిగాం. సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్ధిక పరిస్థితి, ఆదాయ వ్యయాలను పూర్తి అదుపులోకి తెచ్చుకుని సమర్థ ఆర్థిక నిర్వహణ వ్యవస్థను తేగలిగాం... ఈ-ప్రగతి ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే సాంకేతిక వ్యవస్థ లోకి తెచ్చి సేవలన్నిటిని ప్రజలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి ఉంచే అవకాశం కల్పించాం..రియల్ టైం గవెర్నెన్స్ ద్వారా పాలన ను ప్రజలకు మరింత చెరువులోకి తెచ్చాము..."అని ముఖ్యమంత్రి వివరించారు. ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకోగలిగే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు స్పష్టం చేసారు 

క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానం లో పరిశోధన చేసి రాష్ట్రంలో దానిని విస్తృతంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. భారత దేశంలోని కార్యకలాపాలను ముంబై కేంద్రంగా జరిగే 'అలీక్లౌడ్'ను ఏర్పాటు చేశామని అలీబాబా ఎండీ చెప్పారు. మొత్తం దేశంలోని తాము నిర్వహిస్తున్న బి2బి, వాణిజ్య కార్యక్రమాలన్నీ అలీక్లౌడ్ తోనే అనుసంధానమై ఉంటాయని వారు తెలిపారు. మరో కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసుకోవలసిందిగా ముఖ్యమంత్రి సూచించారు.