ఐదు దశాబ్దాలుగా మైనార్టీలను బుజ్జగిస్తూ వచ్చారు

మైనార్టీల గురించి మాట్లాడే కాంగ్రెస్ వారికి ఏమీ చేయకుండా ఐదు దశాబ్దాలు బుజ్జగిస్తూ వచ్చారని,  వారి అభివృద్ధిని మాత్రం పట్టించుకోలదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. బిజెపి మైనారిటీ మోర్చ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరగని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ.. బీజేపీ గురించి ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

వక్ఫ్ బోర్డులకు సంబంధించిన భూములను వక్ఫ్ మాఫియాలు కబ్జా చేశాయని, వారికి సెక్యులర్‌గా చెప్పుకునే పార్టీలు అండగా నిలబడుతున్నాయని తెలిపారు. ముస్లిం మహిళల సామాజిక భద్రత కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చామని   చెప్పారు. అదే విధంగా పాఠశాలల్లో ముస్లిం బాలికల డ్రాఫవుట్ తగ్గించగలిగామని పేర్కొన్నారు. 

 తాము అధికారంలోకి వచ్చిన తరువాత ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ నినాదంతో అందరి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టామని వివరించారు. మతాలకు అతీతంగా పేదలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయాలు తీసుకున్నామని షా ప్రకటించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమైందని  అమిత్ షా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం ద్వారా కశ్మీర్ లోయలో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతమైందని చెబుతూ ఇది పెద్ద విజయమని వ్యాఖ్యానించారు. 

 ఇప్పటివరకూ జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలే పాలించాయని, వారి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగలేదని గుర్తు చేశారు. మోదీ పాలనలో స్థానిక సంస్థలను బలోపేతం చేశామని, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు జరిగిందని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్రవాదాన్ని అరికట్టగలిగామని తెలిపారు. కశ్మీర్‌లో 13 ఏళ్ల తరువాత గతేడాది అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.