బీజేపీపై టిడిపి దుష్ప్రచారం తిప్పికొట్టండి


రాష్ట్రంలో బిజెపిపై  తెలుగు దేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు. విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, కార్య నిర్వాహక సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల రాష్ట్ర పర్యటనలను బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. మోదీ, అమిత్‌షాల రాకతో కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం రాగదని విశ్వాసం వ్యక్తం చేశారు. 

 ఫిబ్రవరి నెలలో జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, ప్రధాని మోదీ విస్తృత స్థాయి విడతల వారీ పర్యటనలు గుంటూరులో భారీ బహిరంగ సభల ఏర్పాట్లు, వాటిని విజయవంతం చేయడంపై కన్నా లక్ష్మీనారాయణ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. 4వ తేదీ నుంచి జరుపతలపెట్టిన బస్సు యాత్ర యథాతథంగా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. 

కార్యకర్తలను తయారు చేయడం పెద్ద కష్టమైన పని కాదని, నాయకులు, కార్యకర్తలు లేని త్రిపుర రాష్ట్రంలో జెండా ఎగరేయడంతోపాటు అధికారం కూడా చేజిక్కించుకున్నామని సహ ఇన్‌చార్జి సునిల్ డియోధర్ గుర్తు చేశారు.  ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగే ప్రజాచైతన్యయాత్ర, శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశం, మోదీ బహిరంగ సభ, నా కుటుంబం - బీజేపీ కుటుంబం, పలు రకాల కార్యక్రమాలపై నిర్ణయం తీసుకున్నారు.

యువమోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ‘కమల్‌కప్’ కబడ్డీ పోటీల గోడపత్రికను కన్నా చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీనికి ముఖ్యఅతిథిగా ప్రొ కబడ్డీ తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్‌చౌదరి వస్తారని యువమోర్చా జాతీయ కార్యదర్శి పనతల సురేష్, రాష్ట్ర అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు తెలిపారు.  

 బీజేపీ జాతీయ సంఘటనా సహ కార్యదర్శి సతీష్‌జీ, రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధరన్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి పురందేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు కూడా  పాల్గొన్నారు.