ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి.. ప్రధాని పిలుపు


 పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.‘ప్రజల మనపై ఉంచి నమ్మకాన్ని వమ్ము చేయవద్దు. చర్చల్లో పాల్గొనడం ద్వారా పార్లమెంట్ గౌరవాన్ని కాపడండి’అని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సమావేశాలను వేదికగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

పార్లమెంట్ వెలుపల ప్రధాని మీడియాతో మాట్లాడుతూ ‘సభలో బాధ్యతాయుతంగా మెలగాలి. ప్రజా సమస్యలపై చర్చించడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనాలి. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురవుతాం’అని మోదీ హెచ్చరించారు. ‘పార్లమెంట్‌లో జరిగే ప్రతి చిన్న సంఘటనా సామాన్య మానవుడిగా తెలిసిపోతుంది. కాబట్టి చర్చల సందర్భంగా ప్రజాప్రయోజనాలను విస్మరిస్తే ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది’అని ప్రధాని స్పష్టం చేశారు. 

సభలో ఏం జరుగుతుంది, తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రవర్తన ఎలా ఉంటోంది? అన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి దేశ ప్రజానికానికి ఉంటుందని, దీన్ని దృష్టిలోపెట్టుకుని మసలుకోవాలని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను, అవసరాలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని ఆయన ఉద్ఘాటించారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి ఎంపీలందరూ కృషి చేస్తారన్న విశ్వాసం మోదీ వ్యక్తం చేశారు.

‘ఎంపీలందరూ ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. సభలో అర్ధవంతమైన చర్చల్లో పాల్గొని ప్రజాసమస్యలు పరిష్కరించడం ద్వారా వారి మన్ననలు పొందుతారు. మీ పనితీరును బట్టే ప్రజల స్పందన ఉంటుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. 

ప్రభుత్వం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నిదానంతో ముందుకెళ్తోందని, సభ్యులు కూడా అదే స్ఫూర్తితో సభలో మెలగాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్ని అంశాలను పార్లమెంట్‌లో చర్చించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సభాకార్యక్రమాలు సజావుగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించాలని ఎంపీలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.