ఏపీలో ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్న బీజేపీ

రానున్న  ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగటం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సమాయత్తం అవుతున్నది. వచ్చే రెండు నెలల్లో తీరికలేని కార్యక్రమాలల్తో రాజకీయంగా రాష్ట్రంలో చొచ్చుకు పోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఒక వంక పోలింగ్ బూత్ స్థాయిలో తమ కార్యకర్తలను సంఘటితం చేసుకొని, వారిని క్రియాశీలకంగా చేయడమతొ పాటు, మరోవంక ప్రజలలోకి రాష్ట్రాభివృద్ధి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి ఇంటికి తీసుకు వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. 

 అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే వారి షెడ్యూలు ఖరారయ్యింది. మరోపక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజాచైతన్య యాత్ర పేరుతో చేపట్టనున్న రథయాత్రను అమిత్ షా ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ రథయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరోపక్క విశ్వవిద్యాలయాల స్థాయిలో యువ సంసద్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీ వరకు పార్టీ నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రాల్లో మేధావులతో సమావేశాలు జరుగుతాయి.

 ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఒడిసాలో జరిగే ఎస్టీ మోర్చా జాతీయ సమ్మేళనానికి రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమైన క్యాడర్ హాజరుకానుంది. ఇక ఫిబ్రవరి 3న విజయవాడలో పెద్ద ఎత్తున మేధావులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఫిబ్రవరి 4న కన్నా రథయాత్రను ప్రారంభించిన అనంతరం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయనగరం, విశాఖ, అరకు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల క్లస్టర్ శక్తి కేంద్ర ప్రముఖ్‌లతో సమావేశమవుతారు. 

ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రజాచైతన్య సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. ఈ సభను విజయవంతంచేయడానికి రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు జన సమీకరణ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న సమర్పణ దివస్ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో జరుపుతారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 2 వరకు నా కుటుంబం - బీజేపీ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతీ కార్యకర్త ఇంటిపైన బీజేపీ జెండాను ఎగురవేయాలి. బీజేపీ స్టిక్కర్‌ను అంటించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు వివరిస్తారు. 

ఫిబ్రవరి 16న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాచైతన్య సభ రెండోది జరుగుతుంది. ఫిబ్రవరి 16, 17న పాట్నాలో ఓబీసీ మోర్చ జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి రాష్ట్రం నుంచి ఓబీసీకి చెందిన క్యాడర్ పెద్ద ఎత్తున హాజరుకానుంది. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొంటారు.

 ఫిబ్రవరి 21న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్ శక్తి కేంద్రాల ప్రముఖ్‌ల సమ్మేళనంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు కొవ్వూరుకు చేరుకున్న రథయాత్రకు స్వాగతం పలుకుతారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో గోరఖ్‌పూర్‌లో కిసాన్ మోర్చ జాతీయ సమ్మేళనం జరుగనున్నది. 

ఫిబ్రవరి  24న ప్రధాని నరేంద్రమోదీ మన్‌కి బాత్-బూత్‌స్థాయిలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని క్యాడర్ అంతా ఆలకించి చర్చించాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని వారితో ఆయన మాట్లాడతారు. ఫిబ్రవరి 26న క్లస్టర్ శక్తి కేంద్రాల సమ్మేళనంను ఒంగోలులో ఏర్పాటుచేశారు.  ఫిబ్రవరి 26న పోలింగ్ బూత్ స్థాయిలో కమల్ జ్యోతి సంకల్ప కార్యక్రమాన్ని, ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ మండల స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తారు.