చలితో వణికిపోతున్న ఉత్తర భారతం


ఉత్తర భారతావనిలోని పలు రాష్ట్రాలు  తీవ్రమైన చలితో వణికిపోతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కుఫ్రీ, మనాలీ తదితర ప్రాంతాల్లో గురువారం మరోసారి మంచు వర్షం కురువడంతో ఆ రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సిమ్లా జిల్లా కుఫ్రీలో బుధవారం సాయంత్రం 5.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు 5 సెం.మీ. మంచు కురువగా, కులూ జిల్లా మనాలీలో 3 సెం.మీ. మంచు కురిసినట్టు సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. 

కిన్నౌర్ జిల్లా కల్పలో అత్యధికంగా 6.4 సెం.మీ, కెయ్‌లాంగ్‌లో 5 సెం.మీ. చొప్పున మంచు కురిసిందన్నారు. కెయ్‌లాంగ్‌లో అత్యల్పంగా మైనస్ 15 సెల్సియస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, కల్పలో మైనస్ 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. కశ్మీర్‌లో గత 40 రోజుల నుంచి కొనసాగుతున్న అత్యంత శీతల పరిస్థితులకు గురువారం తెరపడింది. అయినా పలు ప్రాంతాల్లో చెదురు మదురుగా మంచు కురిసి వెలుతురు సరిగా లేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

శ్రీనగర్-జమ్ము రహదారిని మూసివేయడంతో కశ్మీర్‌తో దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగి పోయా యి. రాంబన్ జిల్లా అనోఖీలో కొండ చరియ లు విరిగిపడటం, క్వాజీగంద్‌లోని జవహర్ సొరంగం చుట్టు మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్-జమ్ము రహదారిని మూసేశారు. ఒడిశాలోని 15 ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 10 సెల్సియస్ డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. కంధమాల్ జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రమైన దరింగిబడితోపాటు అంగుల్‌లో అతి తక్కువగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భువనేశ్వర్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరోవైపు అమెరికా మిడ్‌వెస్ట్ ప్రాంతాన్ని గజగజలాడించిన ఆర్కిటిక్ శీతల పవనాలు గురువారం తూర్పు దిశగా కదిలి మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో అనేక పాఠశాలలు, వ్యాపార సంస్థలను మూసివేయడంతోపాటు పలు విమాన సర్వీసులను, పోస్టల్ సేవలను రద్దు చేశారు. చలి తీవ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా వార్తా సంస్థలు వెల్లడించాయి. దాదాపు డజను రాష్ర్టాల్లో అత్యంత శీతల పరిస్థితులు కొనసాగుతుండటంతో ఇండ్ల నుంచి ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు.

 ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల వలన అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డబుల్ డిజిట్స్‌కు పతనమవడంతో నదులు, సరస్సులు, జలపాతాలు గడ్డకట్టాయి. చికాగోతోపాటు విండీసిటీలో గురువారం మైనస్ 30 సెల్సియస్ డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగకుండా నిరోధించేందుకు వీలుగా గ్యాస్ హీటర్లతో పట్టాలకు నిప్పుపెట్టారు.