రాహుల్ లో ముస్సోలినీ లక్షణాలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నియంత ముస్సోలినీ లక్షణాలు వచ్చాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దేశంలో ఉద్యోగాల సృష్టి జరగడం లేదని ఆరోపించడం హ్రస్వ దృష్టితో చేస్తున్న ఆరోపణ అని ఆరోపించింది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా సగం, సగం పరిజ్ఞానంతో ట్వీట్ లు ఇస్తున్నట్లు మండిపడింది.

రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో ‘‘ఇక ఉద్యోగాలు లేవు! నియంత మనకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఐదేళ్ళ తర్వాత లీక్ అయిన ఉద్యోగాల సృష్టి నివేదిక దేశ విధ్వంసాన్ని వెల్లడిస్తోంది. నిరుద్యోగం 45 ఏళ్ళలో అత్యధిక స్థాయికి చేరింది. 2017-18లోనే 6.5 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. నరేంద్ర మోదీ గద్దె దిగవలసిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాలో ‘‘ఆయనకు (రాహుల్ గాంధీకి) ముస్సోలినీకి ఉన్న హ్రస్వ దృష్టి, అర్థం చేసుకోలేని లక్షణం వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) వాస్తవ సమాచారం ప్రకారం ఉద్యోగాల వృద్ధి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాలను గత 15 నెలల్లో సృష్టించినట్లు వెల్లడవుతోంది. సరైన ఉద్యోగం చేయని, పూర్తిగా నిరుద్యోగి అయిన వ్యక్తి మాత్రమే ఇలా చెప్పుకుంటూ తిరుగుతారు’’ అని పేర్కొంది.

జాతీయ నమూనా అధ్యయనం కార్యాలయం (నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) రూపొందించిన నివేదికను జాతీయ మీడియా ప్రచురించింది. 2017-18లో నిరుద్యోగం 6.1 శాతం ఉందని, ఇది 45 ఏళ్ళలో అత్యధికమని పేర్కొంది. దీని ఆధారంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ముస్సోలినీ 1922 నుంచి 1943 వరకు ఇటలీ ప్రధాన మంత్రిగా చేశారు. 1925 వరకు రాజ్యాంగ బద్ధంగా పరిపాలించారు. ఆ తర్వాత నియంతగా మారారు.