అవినీతి రహిత పాలనకే ప్రాధాన్యత

అవినీతి రహిత పాలనకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  తెలిపారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్‌, విద్యుత్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నవభారత నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. స్వచ్ఛభారత్‌ నిర్మాణంలో భాగంగా తొమ్మిదికోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించామని చెబుతూ దీంతో 3లక్షల కుటుంబాలకు ఆరోగ్యం చేకూరిందని.. మహిళల గౌరవాన్ని పెంచామని రాష్ట్రపతి వివరించారు.

‘‘ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చాం. ప్రతి కుటుంబానికి ఆరోగ్యబీమా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఔషధాల ఖర్చు తగ్గించేందుకు జనఔషధి దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కిడ్నీ బాధితులకు ప్రత్యేక బీమా యోజన తీసుకొచ్చింది. వారి కోసం ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. హృద్రోగులకు స్టెంట్ల ఖర్చు భారీగా తగ్గించాం. పలు రాష్ట్రాల్లో కొత్తగా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశాం’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

దేశంలో నల్లధనం కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టామని రాష్ట్రపతి తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. జన్‌ధన్‌ యోజన కింద 34 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచామని, 2014కి ముందు దేశంలో 3.8 కోట్ల మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లించేవారని చెబుతూ  ప్రస్తుతం 6.8కోట్ల మంది చెల్లిస్తున్నారని వెల్లడించారు. 

జీఎస్టీ ద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకొచ్చామని చెబుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ 77వ స్థానానికి చేరుకొందని చెలిపారు. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకొందని పేర్కొంటూ  మేకిన్‌ ఇండియాలో భాగంగా ఏపీలో మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేశామని ప్రకటించారు. యువత స్వావలంబన కోసం స్టార్టప్‌ కేంద్రాలను ప్రారంభించామని, వీటి ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు యువతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మందికి ఇళ్లు లభించాయి. గృహనిర్మాణాల్లో సమస్యలు తొలగించేందుకు రేరా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని కోవింద్‌ చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. 18వేలకు పైగా గ్రామాల్లో విద్యుదీకరణ చేపట్టామని, . ఇప్పుడు ప్రతి ఇంటికీ విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దివ్యాంగుల కోసం సౌకర్యవంతమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాంమని,  వారికి ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామని చెప్పారు. 

ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ నీలి విప్లవం ద్వారా మత్స్యకారులకు సాంకేతిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంతో గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం, ఈ-గవర్నెన్స్‌ తీసుకొచ్చామని చెప్పారు. 40 వేలకు పైగా గ్రామాల్లో వైఫై హాట్‌స్పాట్‌ సౌకర్యం కల్పించామని రాష్ట్రపతి వివరించారు.