సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు నుండి తప్పుకున్న జస్టిస్ రమణ

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి తాజాగా మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రి ఈ విచారణ నుంచి తప్పుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా వెనక్కితగ్గారు.

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు, తాను ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమని, ఆయన కుమార్తె వివాహానికి కూడా తాను హాజరయ్యానని పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. విచారణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసును తగిన ధర్మాసనానికి అప్పగించాలని సీజేఐ రంజన్‌ గొగొయ్‌ను జస్టిస్‌ రమణ కోరారు.

నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ కామన్‌ కాజ్‌ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తొలుత ఈ పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోనే ధర్మాసనం ముందుకు రాగా ఆయన తప్పుకున్నారు. సీబీఐ నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి సెలక్షన్ కమిటీలో సీజేఐ గొగొయ్‌ సభ్యుడిగా ఉన్నారు. అందుకే ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని ఆయన‌ తెలిపారు.

ఆ తర్వాత ఈ కేసును జస్టిస్‌ సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. అయితే సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తొలగించిన కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందు వల్ల తాను కూడా ఈ విచారణ చేపట్టలేనని జస్టిస్‌ సిక్రి తెలిపారు.