మాజీ డిజిపి వ్యుహత్మకంగానే జగన్ ను కలిసారా !

గత వారం ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని `మర్యాదపూర్వకంగా’ కలవడం ద్వారా తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు సంకేతం ఇచ్చి సంచలనం సృష్టించిన మాజీ డిజిపి యన్ సాంబశివరావు తిరిగి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి తనకు అటువంటి ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని మాజీ డీజీపీ సాంబశివరావు తేల్చిచెప్పడంతో పాటు నామినేటెడ్‌ పదవులపై ఇప్పటికైతే ఆలోచన చేయలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సాంబశివరావు కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు.

విశాఖలో ప్రతిపక్ష నేత జగన్‌ను సాంబశివరావు కలిసిన తర్వాత ఆయన వైసిపిలో చేరుతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి ప్రకటించారు. పైగా ఒంగోలు నుండి ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు వార్త కధనాలు కుడా వెలువడ్డాయి. అయితే మర్యాదపూర్వకంగానే కలిసానని, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేసే ఉద్దేశ్యం లేదని ఆయన అప్పుడే స్పష్టం చేసినా రాజకీయ వర్గాలలో కలకలం మాత్రం రేపారు.

పైగా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను విశాఖ పోలీస్ కమీషనర్ గ ఉన్నానని, అప్పుడు కూడా మర్యాదపూర్వకంగా కలిశానని గుర్తుచేశారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవోగా ఉన్నందున అక్కడకు సమీపంగా జగన్‌ వచ్చినందునే మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు. సమన్వయలోపం కారణంగానే తాను వైసిపి చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించి ఉండవచ్చని సాంబశివరావు వివరణ కుడా ఇచ్చారు.

ఇలా ఉండగా రాస్త్రంలో కాపుల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్న సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన సాంబశివరావును ఏరికోరి చంద్రబాబునాయుడు డిజిపిగా చేసారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన గత నాలుగేళ్ళలో ముగ్గురు డిజిపిలు ఉద్యోగ విరమణ చేయగా వారిలో కేవలం సాంబశివరావుకు మాత్రమె ఉద్యోగ విరమణ చేసిన వెంటనే గంగవరం పోర్టు సీఈవోగా నీయమించారు.

అయినప్పటికీ తన డిజిపి పదవీకాలం పొడిగింపు విషయమై ముఖ్యమంత్రి తగు ఆసక్తి చూపక ప్వోఅడంతో అవకాశం రాలేదని, ఆ తర్వాత ఉహించిన విధంగా కీలకమైన అధికార పదవి ఏవీ లభించలేదని సాంబశివరావు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నారు. తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసమే ఆయన వ్యూహాత్మకంగా జగన్ ను కలసి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసారా అని ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు.

కాగా, ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన రాలేదని చెప్పిన  సాంబశివరావు గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధిపై సలహాలు ఇచ్చినట్లు వెల్లడించారు.