పంచాయతీల్లో పుంజుకున్న ప్రతిపక్షాలు... తగ్గిన టీఆర్‌ఎస్‌ బలం !

 అసెంబ్లీ ఎన్నికల ప్రకియ ముగియగానే అటు రాజకీయ పక్షాలకు, ఇటు ఓటర్లకు, మరోవంక అధికార యంత్రాంగానికి ఊపిరి  పీల్చుకొనే వ్యవధి కూడా లేకుండా తెలంగాణలో జరిగిన గ్రామా పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. సహజంగానే పంచాయతీ ఎన్నికలు అధికార పక్షంకు సానుకూలంగా ఉంటాయి. పైగా రెండు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలలో 80 శాతంకు పైగా సీట్లు గెలుచుకున్న  టీఆర్‌ఎస్‌ గెలుపు సులభం కావలసింది. అయితే ఆ పార్టీ జోరు అప్పుడే తగ్గుతున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. 

నిన్న గాక మొన్న గెలుపొందిన అసెంబ్లీ సీట్ల దామాషాలో అధికార పక్షం గెలుపొందలేక పోయిన్నట్లు స్పష్టం అవుతుంది. అక్కడకు పలు ప్రలోభాలకు, వత్తిడులకు గురిచేసి నాలుగోవంతుకు పైగా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేటట్లు చేసుకున్నా, ఎన్నికల నిబంధనలు అడ్డదిడ్డంగా ఉల్లంఘించి మొత్తం అధికార యంత్రాంగం బాసటగా నిలిచినా ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. 

మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ జరగ్గా మూడింటిలోను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే ఆధిక్యతను చాటుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం పుంజుకున్నది. దాదాపు 40 శాతం పంచాయతీలు టీఆర్‌ఎస్‌ యేతర పక్షాల వశమయ్యాయి. మూడు విడతల్లో మొత్తం 11,549 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద టీఆర్‌ఎస్‌ 7,731, కాంగ్రెస్  2,698,  బిజెపి163, టిడిపి 83, సిపిఎం 77, సిపిఐ 50 ,గెలుపొందగా 1825 గ్రామాల్లో ఇతరులు గెలుపొందారు. 

తొలివిడతలో 4,470 పంచాయ తీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 769 గ్రామాల్లో సర్పం చులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3,701 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక రెండో విడతలో 4,135 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వగా 788 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3,342 గ్రామాల్లో పోలింగ్‌ జరిగింది. మూడో విడతలో 4,116 గ్రామాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 577 గ్రామా లు ఏకగ్రీవం కాగా, 3,506 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లోనూ కలిపి 2134 పంచాయత్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. 

అసెంబ్లీ ఎన్నికలలో సుమారు 80 శాతం ఫలితాలు సాధించిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు 60 శాతంకు మించి సాధించలేక పోయిది. వాటిల్లో నాలుగోవంతుకు పైగా ఏకగ్రీవం కావడం గమనార్హం. అంటే పోటీ ఎదురైనా గ్రామాలలో సగంకు పైగా అధికార పక్షం ఓటమి చెందిన్నట్లు వెల్లడి అవుతున్నది. 

ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా పార్టీల ప్రాబల్యంతోనే ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో అభ్యర్థులు ధన ప్రవాహం సాగించారు.  మద్యం ఏరులై పారింది. ఎమ్మెల్యేలు సైతం ప్రచారాలను నిర్వహించి, వరాలు కుమ్మరించారు. అభ్యర్థుల వ్యయంపై నిఘా పెడుతున్నామంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినా వాస్తవానికి ప్రేక్షక పాత్ర వహించింది. 

పలు గ్రామాలలో వేలం పాటలు జరిపి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినా, ఆ విషయమై పలువురు ఫిర్యాదు చేసినా ఎన్నికల కమీషన్ తగు విచారం అజరిపిన తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలు మౌనమే వహించింది. పంచాయతీలు ఏకగ్రీవమైతే జిల్లా పరిశీలకులు అన్ని వివరాలు పరిశీలించాకే ఆమోదిస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు. పలు పంచాయతీల సర్పంచి, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా ఏకగ్రీవం చేశారు. కేవలం పత్రికలు బయటపెట్టిన అటువంటి ఒక పంచాయతీ ఏకగ్రీవాన్ని మాత్రమే ఈసీ రద్దు చేసింది. 

ఎన్నికల ప్రక్రియపై సరైన అవగాహన కల్పించకపోవటంతో తొలి విడతలో కొన్ని తప్పిదాలు చోటు చేసుకొన్నాయి. అవి కొందరు అభ్యర్థుల విజయావకాశాలను తారుమారు చేశాయి. ఓటరుకు రెండు బ్యాలెట్‌ పత్రాలను ఒకేసారి ఇచ్చేయటంతో చాలాచోట్ల ఓటరు ఒకదానిపై ఓటు వేసి రెండోదాన్ని ఖాళీగా వదిలేశారు. రెండో బ్యాలెట్‌ పత్రంపై వేసిన ముద్ర కనిపించకపోవటం, పత్రాలను సరిగ్గా మడవకపోవటంతో ఒక గుర్తుపై వేసిన ముద్ర మరో గుర్తుపైన పడటంతో చాలా చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి. 

ఓటర్ల గుర్తింపుకార్డును చూడకుండా వారు తెచ్చిన ఓటరు చిట్టీని చూసి లోపలకు అనుమతించటంతో కొన్ని చోట్ల దొంగ ఓట్లూ నమోదయ్యాయి. ఇటువంటి లోపాలు రెండు, మూడు విడతల్లో పునరావృతం కాకుండా చూడాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులు కొన్ని చోట్ల మాత్రమే అమలయ్యాయి. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే చీటీలపై వారి పేర్లు రాసి డ్రా తీయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే కొన్నిచోట్ల టాస్‌తో విజేతను ఎంపిక చేశారు.

అడ్డా సిద్ధంగా ఎన్నికలు జరపడంతో న్యాయపరమైన వివాదాలూ పెరిగాయి. పంచాయతీలు చిన్నవి కావటంతో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. దీంతో ఇలాంటిచోట్ల రీకౌంటింగ్‌ కోసం అధికారులపై ఒత్తిడి పెరిగింది. అక్రమాలకు పాల్పడి గెలిచారనే ఫిర్యాదులూ ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వం ఎన్నికల పిటిషన్లను విచారించి, తీర్పులు ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజనులే లేని కొన్ని పంచాయతీలను గిరిజనులకు కేటాయించటంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ''అపాయింటెడ్‌ డే''ను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం పంచాయతీ రాజ్‌ శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం  ఫిబ్రవరి 2న అపాయింటెడ్‌ డేగా నిర్ణయించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించి పాలకమండలి తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.