కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ వలసిందే ... మోదీ

కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడడం అత్యంత అవసరమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఏ పార్టీకీ తగిన ఆధిక్యం రాని హంగ్‌ పార్లమెంట్ల ద్వారా గతంలో 30ఏళ్ల పాటు భారత్‌లో అస్థిరత నెలకొందని గుర్తు చేశారు.  2014 ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయడంతో కేంద్రంలో సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటైందని, ఆ 3 దశాబ్దాల నాటి పరిస్థితులు లేకుండా పురోగమించడానికి దోహదపడిందని ప్రధాని పేర్కొన్నారు. 

ఇప్పుడు తానేం చేశానని అడిగితే సమాధానం చెబుతానని అంటూ తమకు పూర్తి ఆధిక్యం కట్టబెట్టడం వల్లే ముద్ర రుణ పథకం వంటివి విజయవంతమైనట్లు వివరించారు. బుధవారం సూరత్ లో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ తమ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని సమర్థించుకున్నారు. దీని ద్వారా ఇండ్ల ధరలు దిగివచ్చాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనానికి చెక్ పెట్టడం ద్వారా అందుబాటు ధరలో నేటి తరం నివాసాలను పొందుతోందని తెలిపారు. 

యూపీఏ ప్రభుత్వం 25 లక్షల ఇండ్లు నిర్మించగా, తమ ప్రభుత్వం గత నాలుగున్నరేండ్లలో 1.30 కోట్ల ఇండ్లను నిర్మించిందని చెప్పారు. ఇది చేయాలంటే గత ప్రభుత్వానికి ఇంకో 25 ఏండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమేంటని తనను ప్రశ్నిస్తున్నారని, అయితే ఆ నిర్ణయం తర్వాత అందుబాటు ధరలో ఇండ్లను కొన్న యువతను ఆ ప్రశ్నను అడగాలని మోదీ సమాధానమిచ్చారు. 

ఇంతకుమందు రియల్‌ఎస్టేట్ రంగంలో నల్లధనం పోగుబడి ఉండేదని, పెద్ద నోట్ల రద్దు,రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా నల్లధనానికి తమ ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పారు.

ప్రతికూల స్వభావం కలిగిన వ్యక్తులు నాడు మహాత్మాగాంధీ చారిత్రక దండి యాత్ర చేపట్టకుండా అడ్డుకోవాలని చూశారని, అలాంటి వారే నేడు తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజానుకూల విధానాలను ప్రశ్నిస్తున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ 71వ వర్ధంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని దండిలో ఏర్పాటుచేసిన జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని, మ్యూజియాన్ని ప్రధాని  జాతికి అంకితం చేశారు.