రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి గెలిచి అధికారంలోకి వస్తే రోజుకో నేత ప్రధానిమంత్రి పదవిలో కొనసాగుతారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘ఒకవేళ ఆ కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధానిగా సోమవారం మాయావతి, మంగళవారం అఖిలేశ్ యాదవ్, బుధవారం మమతా బెనర్జీ, గురువారం శరద్ పవార్, శుక్రవారం దేవెగౌడ, శనివారం స్టాలిన్ ఉంటారు. ఇక ఆదివారం.. దేశం మొత్తానికి సెలవు లభిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.
బిజెపిపై భయం వల్లే ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని ఆయన విమర్శించారు. ‘గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏకు 73 సీట్లు దక్కాయి. ఈ సారి 74 సీట్లు సాధిస్తాం. బీఎస్పీ-ఎస్పీది అవినీతి కూటమి. మన కార్యకర్తలు ఆ కూటమిని ఓడించేందుకు పనిచేయాలి' అని పిలుపిచ్చారు.
ఆ పార్టీలు కులతత్వ రాజకీయాలు చేస్తాయి. యూపీలో 2017 శాసనసభ ఎన్నికల్లోనూ ఇటువంటిదే ఓ కూటమి ఏర్పాటైంది. దాన్నిబీజేపీ కార్యకర్తలు ఎలా ఓడించారో అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకుందని అంటూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గురించి నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఆ స్థానంలో మరో కూటమి ఏర్పడిందని చెబుతూ కులతత్వ రాజకీయాల వల్ల యూపీని అభివృద్ధి పథాన నడిపించలేకపోయిన వారు ఇప్పుడు కలిశారని మండిపడ్డారు.
వారు అధికారంలో ఉన్న సమయంలో నేరాలు, అవినీతికి మారుపేరులా పాలన కొనసాగించారని అమిత్ షా దుయ్యబట్టారు. ‘కూటములను ఏర్పాటు చేసుకోనివ్వండి. బీజేపీకి బూత్ స్థాయి నుంచి సిద్ధంగా ఉంది. బిజెపి ప్రభుత్వం ఏదో ఒక కులం కోసం పనిచేయదు. అందరి అభివృద్ధి కోసం పని చేస్తుంది. ప్రధాని మోదీ లాంటి నాయకుడు మాత్రమే ఎటువంటి రాజీ ధోరణి చూపకుండా పాలన కొనసాగించగలరు. 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తి వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
దేశంలోకి అక్రమంగా చొరబడి నివసిస్తున్న వారిపై ప్రతిపక్షాల వైఖరి ఏంటో తెలపాలని అమిత్ షా డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి శక్తిమంతమైన సర్కారు ఉండాలని కోరుకుంటోందని, అయితే ప్రతిపక్షాలు నిస్సహాయ ప్రభుత్వం ఉండాలని భావిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్లు పేదలకు చాలా ప్రయోజనాలు చేకూర్చుతాయని చెప్పారు. ఎన్డీఏ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని వివరించారు.