చిల్లర రాజకీయాల కోసం పలుకరించారా?

 కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గోవా ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసే సాకుతో వచ్చి, దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారా? అని నిలదీశారు. గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. తనతో రాహుల్ మాట్లాడినపుడు రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు.

చాలా కాలం నుంచి పాంక్రియాటిస్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ మంగళవారం సందర్శించిన సంగతి తెలిసిందే. కొచ్చిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ తాను గోవా ముఖ్యమంత్రి పారికర్‌తో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి మాట్లాడినట్లు తెలిపారు. తనకు ఈ ఒప్పందంలో ప్రమేయం లేదని పారికర్ స్పష్టంగా చెప్పారన్నారు. రిలయెన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేశారని రాహుల్ ఆరోపించారు.

దీనిపై పారికర్ స్పందిస్తూ బుధవారం ఓ లేఖ రాశారు. తాను రాహుల్ గాంధీతో ఆరోగ్యకరమైన రాజకీయ స్ఫూర్తితో మాట్లాడినట్లు తెలిపారు. ‘‘మీరు నా కార్యాలయానికి రావడంపై మీడియా కథనాలను చదివిన తర్వాత నాకు బాధ కలిగింది. మీరు ఈ సందర్శనను చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం నన్ను బాధించింది.

‘‘మీరు నాతో గడిపిన 5 నిమిషాల్లో మీరు నాతో రఫేల్ గురించి ఏమీ మాట్లాడలేదు, దానికి సంబంధించిన దేని గురించి కూడా చర్చించలేదు. రఫేల్ గురించి ఏమీ ప్రస్తావించలేదు’’ అని పారికర్ పేర్కొన్నారు.

‘‘మర్యాదపూర్వకంగా కలవడం, ఆ తర్వాత చిల్లర రాజకీయాల కోసం తప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి పాతాళానికి దిగజారడం, ఇదంతా చూసిన తర్వాత నా మనసులో మీ సందర్శన వెనుక నిజాయితీ, ఉద్దేశాలపై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి’’ అని పారికర్ పేర్కొన్నారు. ఇటువంటి చాణక్యాలను ప్రాణాపాయకరమైన వ్యాధితో పోరాడుతున్న వ్యక్తి విషయంలో ఉపయోగించకూడదని తెలిపారు.

రఫేల్ ఒప్పందంపై తాను గతంలో చెప్పిన విషయాలనే మళ్ళీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చెప్పాలనుకుంటున్నానని పారికర్ చెప్పారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, అన్ని నిర్దేశిత విధానాలను అనుసరిస్తూ యుద్ధ విమానాలను కొంటున్నామని తెలిపారు.

రాహుల్ పచ్చి అబద్ధాలకోరు

 కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడమే పరిపాటిగా మారిందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ప్రసన్న కార్తీక్ ధ్వజమెత్తారు. రాఫెల్ ఫైటర్ డీల్‌ ఖరారులో తనకెలాంటి ప్రమేయం లేదని పారికర్ తనతో చెప్పినట్టు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కార్తీక్ స్పందించారు. ఆయన సందర్భ శుద్ధి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ మంగళవారంనాడు మనోహర్ పారికర్‌ను కలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిలషించారు. వ్యక్తిగత హోదాలోనే పారికన్‌ను కలుసున్నట్టు ఆ తర్వాత ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత కేరళలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, రాఫెల్ కొత్త ఒప్పందంతో తనకెలాంటి సంబంధం లేదని తనతో పారికర్ చెప్పారని, అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ కొత్త ఒప్పందం చేశారని రాహుల్ తెలిపారు.

రాహుల్ వ్యాఖ్యలను ఓఎస్‌డీ కార్తీక్ ఖండిస్తూ, సీఎం త్వరగా కోలుకోవాలని తాను, తన తల్లి కోరుకుంటున్నట్టు విషయాన్ని పారికర్‌కు తెలియజేసేందుకు వచ్చినట్టు రాహుల్ తమకు చెప్పారని, దాంతో ఆయనతో గౌరవప్రదంగా సమావేశమయ్యేందుకు పారికర్ అంగీకరించారని చెప్పారు. 'కేన్సర్‌తో  పారాటం చేస్తూ కూడా ప్రజల కోసం రాజీ లేకుండా పనిచేస్తున్న పారికర్‌పై సందర్భ శుద్ధి లేని వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు' అని కార్తీక్ ఓ ట్వీట్‌లో రాహుల్‌ను తప్పుపట్టారు.