మోదీ ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖలకు రాక

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే ముందే వచ్చే నెలలో రెండు సార్లు ప్రధాన మంత్రి, మూడు సార్లు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి, బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. 

ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేబడుతున్న బస్సు యాత్రను అమిత్ షా స్వయంగా ప్రారంభిస్తారు. మరో రెండు సార్లు కూడా వచ్చే నెల రాష్ట్రంలో పర్యటిస్తారని కన్నా చెప్పారు. 

కాగా, ప్రధాని వచ్చే నెల 10న గుంటూరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనవరి 6న ఆయన గుంటూరు రావలసి ఉన్నా, వీలుకాక రాలేక పోయారు. తిరిగి ఫిబ్రవరి 16న ఆయన విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  

వీరిద్దరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటింపనున్నారు.